Gujarat Polls: రూ.33వేల కోట్లు విద్యా రంగానికే!: మోదీ

గుజరాత్‌లో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయని ప్రధాని మోదీ అన్నారు. 20 ఏళ్ల క్రితం రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1600 కోట్లుగా ఉన్న కేటాయింపులు.. ప్రస్తుతం రూ.33 వేల కోట్లకు చేరాయని అన్నారు.

Published : 24 Nov 2022 20:00 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చిన పార్టీ భాజపా అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని దేఘం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో శాస్త్రీయ విధానంలో, ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధన సాగుతోందని చెప్పారు. ఇటీవల అహ్మదాబాద్‌లో పర్యటించిన ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ గుజరాత్‌లోని విద్యా వ్యవస్థపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే దిల్లీ తరహా విద్యా విధానాన్ని ఇక్కడ అమలు చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్‌లో సుమారు రూ.33 వేల కోట్లు విద్యారంగం కోసమే కేటాయిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఇది కొన్ని రాష్ట్రాల మొత్తం బడ్జెట్‌ కంటే ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ 20 ఏళ్ల క్రితం విద్యారంగం కోసం గుజరాత్‌ బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ.1,600 కోట్లు. ప్రస్తుతం ఇది రూ.33వేల కోట్లకు చేరింది. కొన్ని రాష్ట్రాల మొత్తం బడ్జెట్‌ కంటే ఇది ఎక్కువ’’ అని ప్రధాని మోదీ అన్నారు.

భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం రూపురేఖలే మారిపోయాయని మోదీ తెలిపారు. గాంధీనగర్‌ ‘ఎడ్యుకేషన్‌ హబ్‌’గా తయారైందని, ఎన్నో కళాశాలలు, యూనివర్సిటీలకు ఇది నిలయంగా మారిందని చెప్పారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫొరెన్సిక్‌ సైన్స్‌, చిల్డ్రన్‌ యూనివర్సిటీలు అహ్మదాబాద్‌లోనే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. భారత్‌లో మొట్టమొదటి ఎనర్జీ యూనివర్సిటీ (పండిత్‌ దీన్‌దయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీ), మారిటైమ్‌ యూనివర్సిటీలు గాంధీనగర్‌లోనే ఉన్నాయన్నారు.

ప్రస్తుతం ప్రతిపక్షంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌కు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న దానిపై స్పష్టమైన ప్రణాళికలు లేవని, భాజపా నేతలను విమర్శించేందుకే ఆ పార్టీ నేతలకు సమయం సరిపోతోందని మోదీ విమర్శించారు. అంతేకాకుండా పేదల అభ్యున్నతికి భాజపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. గత 27 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న భాజపాను ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని, మళ్లీ కమలం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌ అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో డిసెంబరు 1, 5న పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని