BRS: ఇందిరమ్మ రాజ్యంలో ఇదేనా సంక్షేమం?: కడియం శ్రీహరి

ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్‌పార్టీ గెలిచిందని భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు.

Updated : 06 Jan 2024 17:51 IST

హైదరాబాద్‌: ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో భారాస పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇందిరమ్మ రాజ్యంలో బ్రహ్మాండమైన సంక్షేమం ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ప్రజలు భావించారు. కానీ, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసే యోచన చేస్తోంది.

భారాస తెచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేయడం వల్ల లక్షలాది మంది లబ్ధిదారులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఎంపిక చేసిన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్లు అనుమతి పత్రాలు కూడా ఇచ్చారు. ‘దళితబంధు’కు నిధులు కేటాయించలేదని తెలిసింది. రైతుబంధు ఇవ్వడంలో నిర్లక్ష్యం జరుగుతోంది. ప్రభుత్వ ఆదాయంపై అవగాహన లేక అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. డిసెంబరు 9న తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. రైతులు తీసుకున్న పంట రుణాలు రూ.2లక్షల వరకు మాఫీ చేస్తాం, దానిపైనే తొలి సంతకం అని గొప్పగా చెప్పారు. కానీ, ఈరోజు వరకు అతీగతీ లేదు. ఎప్పుడు రుణమాఫీ చేస్తారో చెప్పే పరిస్థితి లేదు’’ అని కడియం శ్రీహరి విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని