
UP Election 2022:యోగిపైపోటీ.. మొదటి ప్రత్యర్థి ఖరారు..!
దిల్లీ: త్వరలో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీలన్నీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ సదర్ నుంచి పోటీ చేయనున్నట్లు భాజపా ప్రకటించగా.. ఆయనకు సవాలు విసిరేందుకు ఆజాద్ సమాజ్ పార్టీ(ఏఎస్‌పీ) సిద్ధమైంది. తమ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రకటించింది. యోగిపై పోటీ చేస్తానని ఆజాద్ గతంలోనే అన్నారు. ఇప్పుడది కార్యరూపం దాల్చనుంది.
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీపై పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన.. తనకంటూ ఒక పార్టీ లేకపోవడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పారు. యోగి మొదటి సారి రాష్ట్ర ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఆయనకు ప్రధాన పోటీ సమాజ్‌వాదీ పార్టీ నుంచే ఉండనుంది. అయితే ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
పంజాబ్‌లో ఆప్ సీఎం అభ్యర్థి పోటీ ఎక్కడినుంచంటే..?
పంజాబ్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సిద్ధమవుతోంది. పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ బరిలో నిల్చునే స్థానాన్ని గురువారం ఖరారు చేసింది. ఆయన ధురి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీచేస్తారని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.