Andhra News: 800 మందిపై అత్యాచారాలు జరిగితే ఒక్కరికీ న్యాయం చేయలేదు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని.. 800 మందిపై అత్యాచారాలు జరిగితే ఒక్కరికీ న్యాయం చేయలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. పార్టీ ముఖ్యనేతలతో

Published : 25 Apr 2022 16:46 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై నేరాలకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని.. 800 మందిపై అత్యాచారాలు జరిగితే ఒక్కరికీ న్యాయం చేయలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. పార్టీ ముఖ్యనేతలతో తెదేపా అధినేత చంద్రబాబు వ్యూహకమిటీ సమావేశం నిర్వహించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. ప్రభుత్వ వైఫల్యంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని ప్రణాళికలు సిద్ధం చేయాలని సమావేశంలో తీర్మానించారు. మహిళలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 27న ధర్నాలకు పిలుపునివ్వాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

భేటీలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగులు, ఉపాధ్యాయులపై సీఎం జగన్‌ ప్రతీకారం దుర్మార్గం. న్యాయం చేయాలని రోడ్డెక్కితే నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారు. హక్కుల కోసం పోరాడితే అరెస్టులు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభాన్ని జులై 8కి మార్చడం ఏంటి? ప్రభుత్వ విద్యావ్యవస్థను నాశనం చేయాలని చూస్తున్నారు. నేరగాళ్లకు వైకాపా ప్రభుత్వం కొత్త మార్గాలను చూపిస్తోంది. మంత్రి కాకాణి కేసుకు సంబంధించి ఆధారాల చోరీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జగన్‌ అసమర్థ పాలనతో రాష్ట్రంలో యువత భవిష్యత్తు కాలరాశాడు. మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాన్ని విద్యుత్‌ కోతలతో అల్లాడిపోయేలా చేశారు. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం తన అసమర్థతకు బలి చేసింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టింది? పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెక్టుని నాశనం చేశారు. డయాఫ్రమ్‌ వాల్ ఎందుకు కూలిందో చెప్పకుండా.. తెదేపాపై ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ తాగునీటి కష్టాలు ఎదురవడానికి ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణం’’ అని చంద్రబాబు విమర్శించారు.

తెలుగుదేశం చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీతో ఉండే ప్రతి కుటుంబ సభ్యుడూ సభ్యత్వాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. అనుబంధ కమిటీల్లో యువతకు అధిక ప్రాధాన్యం కల్పించడం, గ్రామస్థాయి కమిటీల్లో యువత అధికంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని