Chandrababu: నాకు అనుభవం ఉంది.. పవన్‌కు పవర్‌ ఉంది: చంద్రబాబు

జగన్‌ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated : 10 Apr 2024 19:46 IST

తణుకు: జగన్‌ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ పాల్గొని ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. 

చంద్రబాబు మాట్లాడుతూ... సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులకుని.. ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్‌ కల్యాణ్ అని అభినందించారు.‘‘నాకు అనుభవం ఉంది.. పవన్‌కు పవర్‌ ఉంది. అగ్నికి వాయువు తోడైనట్లు... ప్రజాగళానికి వారాహి తోడైంది. అహంకారాన్ని బూడిద చేస్తుంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు కలిశాయి. సైకిల్‌ స్పీడ్‌కు తిరుగులేదు.. గ్లాస్‌ జోరుకు ఎదురు లేదు. వచ్చే ఎన్నికల్లో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం. వ్యక్తిగత దాడులు తట్టుకుని పవన్‌ నిలబడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదట చెప్పిన వ్యక్తి ఆయనే. చీకటి పాలన అంతానికి ఓటు చీలకూడదని చెప్పారు. యువత కన్నెర్ర చేస్తే జగన్‌ లండన్‌ పారిపోతాడు. విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి.. అప్పుల పాలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరం. కేంద్ర మద్దతుతో శిథిల రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతాం. రైతును రాజుగా చేసే బాధ్యత నాది. రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని పౌరసరఫరాలశాఖ మంత్రి తణుకులో ఉన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే మొదటి సంతకం చేస్తా.

కారుమూరు వంటి ముదురును నా జీవితంలో చూడలేదు..

అధికారం అంటే దోపిడీ అని జగన్‌ అనుకున్నారు.. అందుకే ప్రజల ఆస్తులను దోచేశారు. ప్రతిపక్షాలపై కేసులు, దాడులు. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది.. మీ జీతం రూ.5వేల నుంచి 10వేలకు పెంచుతాం. రాజీనామా చేయొద్దు.. మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని చెడగొట్టాలని జగన్‌ చూస్తున్నారు. అధికారంలోకి రాగానే ఉపాధి కల్పనపై శ్రద్ధపెడతాం. దొంగలు సృష్టించే నకిలీ వార్తలు నమ్మవద్దు. కూటమి తరఫున నిర్దిష్ట అజెండాతో ప్రజల ముందుకు వస్తున్నాం. కారుమూరు వంటి ముదురును నా జీవితంలో చూడలేదు. తణుకులో అభివృద్ధి చేయాలంటే కారుమూరుకు ట్యాక్స్‌ కట్టాలి. రూ.850 కోట్ల మేర టీడీఆర్‌ బాండ్ల స్కామ్‌ చేశారు. పేదల ఇళ్ల పేరిట స్థలాలు కొని ప్రభుత్వానికి అమ్మారు. ఇళ్ల స్థలాల పేరుతో రాష్ట్రంలో దాదాపు రూ.70వేల కోట్లు కొట్టేశారు’’ అని చంద్రబాబు విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని