Chandrababu: లా అండ్‌ ఆర్డర్‌ సరిగా ఉంటే రేపల్లె ఘటన జరిగేది కాదు: చంద్రబాబు

ఏపీలో శాంతిభద్రతలు విచ్ఛిన్నం అయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నేరాలను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులతో పాటు

Published : 02 May 2022 12:58 IST

డీజీపీకి తెదేపా అధినేత లేఖ

అమరావతి: ఏపీలో శాంతిభద్రతలు విచ్ఛిన్నం అయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నేరాలను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులతో పాటు నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైమ్‌ రేట్‌పై వివరాలు, మీడియాలో వచ్చిన కథనాలు, వీడియోలను ఆ లేఖకు చంద్రబాబు జత చేశారు. జంగిల్‌ రాజ్‌ పాలనలో ప్రజలకు భద్రత కరవైందని.. రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతినేలా పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. 

పేట్రేగుతున్న వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుశాఖ విఫలమవుతోందని చంద్రబాబు విమర్శించారు. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కారణమంటూ మృతుడు గంజి ప్రసాద్‌ భార్య చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసేందుకు వెళ్తున్న వారినపై దాడిని నివారించడంలో పోలీసులు విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. లా అండ్‌ ఆర్డర్‌ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వేస్టేషన్‌లో అత్యాచార ఘటన జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో హింస, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణమవుతున్నాయని విమర్శించారు. గంజాయి సరఫరాలో వైకాపా నేతల ప్రవేయం కనిపిస్తున్నా.. పోలీసుశాఖ తగు చర్యలు తీసుకోవడం లేదని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని