Karnataka Elections: అందుకే వాళ్లను ఇంటికి పంపేశారు: బసవరాజ్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ (BJP) విజయం సాధించడం తథ్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మరోసారి పరాజయం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

Published : 04 Mar 2023 01:45 IST

బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కమలం పార్టీ (BJP) వికసించడం తథ్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) ధీమా వ్యక్తం చేశారు. మే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) భాజపా భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తున్న కాంగ్రెస్‌ (Congress)కు ఈసారి కూడా  పరాజయం తప్పదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌.. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల అభ్యున్నతిని పూర్తిగా వదిలేసింది. అందుకే ప్రజలు వాళ్లను ఇంటికి పంపేశారు’’ అని బొమ్మై అన్నారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌ తప్పుడు వాగ్దానాలు చేస్తోందని, తద్వారా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని బొమ్మై ఆరోపించారు.‘‘ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ రూ.2000 ఇస్తామని వాగ్దానం చేస్తోంది. దీనికోసం రూ.24,000 కోట్లు ఖర్చవుతుంది. అంతపెద్ద మొత్తంలో నిధులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు. కాంగ్రెస్‌ అడ్డదారుల్లో విజయం సాధించాలని చూస్తోంది. అందుకే తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది.’’ అని బొమ్మై విమర్శించారు. భాజపా ప్రభుత్వ పాలనపైన నమ్మకంతో ప్రజలు మళ్లీ కమలం పార్టీకే ఓటు వేస్తారని సీఎం అన్నారు.

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయలో విజయాలతో జోరుమీదనున్న కాషాయదళం.. కర్ణాటకలోనూ విజయదుందుబి మోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే గురువారం బెళగావి జిల్లాలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విజయ్‌ సంకల్ప యాత్రను ప్రారంభించారు. త్వరలో ప్రధాని మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌తోపాటు పలువురు పార్టీ సీనియర్‌ నేతలు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం, రోడ్‌షోలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని