నీడనిచ్చే చెట్టును నరుక్కునే మూర్ఖులం కాదు.. సీఎంతో భేటీ అనంతరం కాకాణి

నెల్లూరు ‘వైకాపా’ పంచాయితీ తాడేపల్లిలోని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయానికి చేరింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌లను జగన్‌ పిలిపించారు.

Published : 21 Apr 2022 01:47 IST

అమరావతి: నెల్లూరు ‘వైకాపా’ పంచాయితీ తాడేపల్లిలోని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయానికి చేరింది. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌లను జగన్‌ పిలిపించారు. దీంతో వాళ్లిద్దరూ అక్కడికి చేరుకున్నారు.

నేతలిద్దరితో జగన్‌ వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత అనిల్‌ యాదవ్‌ సీఎంతో సమావేశమయ్యారు. ఇటీవల నెల్లూరు నగరంలో ఫ్లెక్సీల చించివేత, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో విభేదాలు, ఆయనపై చేసిన విమర్శలు తదితర అంశాలపై జగన్‌కు అనిల్‌ వివరించినట్లు సమాచారం. భేటీ అనంతరం అనిల్‌ మాట్లాడుతూ.. ‘‘కాకాణికి, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సాయం చేసిన వారికి మరింత ఎక్కువ సాయం చేస్తాను. నెల్లూరులో ఫ్లెక్సీల వివాదం ఏమీ లేదు. నెల్లూరు అభివృద్ధిపై ఆనం వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే విదిలేస్తున్నాను. కొందరు నేతలు రకరకాల సందర్భాల్లో మాట్లాడతారు. పార్టీ బలోపేతం తప్ప మేం మరేదీ ఆలోచించం’’ అని పేర్కొన్నారు.

అనిల్‌తో భేటీ అనంతరం మంత్రి కాకాణి సీఎం జగన్‌ను కలిశారు. భేటీ అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అనిల్‌కు, నాకు ఎలాంటి విభేదాలు లేవు. మా మధ్య గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సభ పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. పోటాపోటీ సభలు అనేది అవాస్తవం. నెల్లూరు అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. నీడనిచ్చే చెట్టును నరుక్కునే మూర్ఖులం కాదు. పార్టీ అభివృద్ధి గురించి మాత్రమే సీఎంతో మాట్లాడాం. జిల్లా అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టాలని.. ఇద్దరూ సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు’’ అని కాకాణి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని