Telangana News: మెయినాబాద్‌ ఘటనపై ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం కేసీఆర్‌

ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావుతో సమావేశమయ్యారు. మెయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ ఘటనపై చర్చించారు. 

Updated : 27 Oct 2022 02:54 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. మునుగోడు ఉప ఎన్నిక వేళ తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు యత్నించారన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. దీంతో ఈ ఘటనపై తెరాస నాయకత్వం దృష్టిసారించింది.  ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. వీరితో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రగతిభవన్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 

ఈ ఘటన పట్ల మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యాన్ని భాజపా అపహస్యం చేస్తోంది. సిగ్గుఎగ్గు లేకుండా ఎమ్మెల్యేలను కొనేందుకు యత్నించింది. తెరాసను దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. తెరాస ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే రకం కాదు. ధనబలంతో ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారు. కేసీఆర్‌ ముందు మోదీ, అమిత్‌ షా ఆటలు సాగవు. తెరాస ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరం కాదు’’ అని మంత్రిఅన్నారు. 

అధికార తెరాసకు చెందిన ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావు, పైలెట్‌ రోహిత్‌రెడ్డిలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు వచ్చారన్న పక్కా సమాచారంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించారు. నగరశివారులోని మొయినాబాద్‌లో గల ఓ ఫాంహౌజ్‌లో పోలీసులు వీరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని