Kharge: మోదీ ప్రచారానికి వచ్చే ముందు ఆ ముగ్గుర్నీ పంపుతారు: ఖర్గే విమర్శలు

ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్‌జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు.

Published : 06 Nov 2023 16:27 IST

జోధ్‌పుర్‌: ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడికైనా వెళ్లే ముందు ఆయన ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థల అధికారుల్ని పంపిస్తారని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజస్థాన్‌లో ఎన్నికల వేళ జోధ్‌పుర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే ప్రసంగించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని భాజపా సర్కార్‌ పాలనపై విమర్శలు గుప్పించారు.  మోదీ పేదల నుంచి ఓట్లు పొంది ధనికులకు సాయం చేస్తున్నారని.. ఆయన హయాంలో ధనవంతులు మరింత సంపన్నులు కాగా.. పేదలు ఇంకా దారిద్ర్యంలో కూరుకుపోతున్నారని ఆక్షేపించారు. 

‘ఐదు రాష్ట్రాల్లో విజయం కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్యం’

ఇప్పుడు ఎన్నికల సమయం గనకే మోదీ పేదల గురించి ఆలోచిస్తున్నారని ఖర్గే అన్నారు. కేవలం మాటలు చెబితే ఏమీ జరగదన్న ఆయన.. ప్రజలకు ఆహారం, ఉద్యోగాలు, చదువుకునేందుకు పాఠశాలలు కావాలన్నారు. కేవలం గొప్ప గొప్ప నినాదాలు, ప్రసంగాల ద్వారా అవి సాకారం కావన్నారు. అంతకముందు ఖర్గే ఛత్తీస్‌గఢ్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. భాజపా ఏం చేయాలన్నా చేసుకోవచ్చని.. ఛత్తీస్‌గఢ్‌లో గెలిచేది మాత్రం తామేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు