Congress: ‘ఐదు రాష్ట్రాల్లో విజయం కాంగ్రెస్‌కు ఎంతో ముఖ్యం’

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవడం ఎంతో ముఖ్యమని శివసేన (యూబీటీ) అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. 

Published : 06 Nov 2023 15:03 IST

ముంబయి: విపక్షాల కూటమి ‘ఇండియా’లో విభేదాలు తలెత్తున్న వేళ.. శివసేన (యూబీటీ) అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రంలోని నియంతృత్వ పాలనను గద్దె దించేందుకు ఇండియా కూటమి ఏర్పాటైనట్లు తెలిపింది. రాష్ట్రంలో, కేంద్రంలో రాజకీయాలు వేరుగా ఉంటాయని అభిప్రాయపడింది. ‘‘కేంద్రంలో నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే ఇండియా కూటమి ఏర్పడింది. ఇదే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. కానీ, రాష్ట్రంలో రాజకీయాలు, కేంద్రంలో రాజకీయాలు వేరుగా ఉంటాయి. పార్టీలు వాటికనుగుణంగా నిర్ణయాలు తీసుకోక తప్పదు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మిజోరం ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. ఇండియా కూటమికి ఆ గెలుపు ఎంతో ముఖ్యం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి తప్పక విజయం సాధిస్తుంది’’ అని సంపాదకీయంలో పేర్కొంది.   

సీఎం సలహాతోనే దుబాయ్‌ వెళ్లిపోయా: బెట్టింగ్‌ యాప్‌ ఓనర్ సంచలన ఆరోపణలు

గత వారం కాంగ్రెస్ వల్లే ఇండియా కూటమి జోరు తగ్గిందని బిహార్ సీఎం నీతీశ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతోన్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నిమగ్నమైందని, విపక్షాల కూటమిపై అంతగా దృష్టిపెట్టడం లేదని విమర్శించారు. నీతీశ్‌ కుమార్‌ బహిరంగంగా ఈ విధమైన విమర్శలు చేసి ఉండాల్సింది కాదని శివసేన అభిప్రాయపడింది. మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలైన కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌లు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ విమర్శలు చేశారు. దీంతో ఇండియా కూటమి బీటలు వారిందనే వాదనలు వినిపించాయి. ఈ పరిణామాల నడుమ కాంగ్రెస్‌ పార్టీ చర్యలను సమర్థిస్తూ శివసేన (యూబీటీ) పత్రిక సామ్నాలో సంపాదకీయం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని