Arvind Kejriwal: ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్‌ను వ్యతిరేకించిన ఈడీ

Arvind Kejriwal: ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఈడీ తెలిపింది. ఆ కారణంతో కేజ్రీవాల్‌కు బెయిలివ్వడం.. చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని పేర్కొంది.

Published : 09 May 2024 17:06 IST

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసు (Delhi Excise Policy Scam Case)లో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ (Interim Bail) జారీ చేసే అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం (మే 10) ఉత్తర్వులు వెలువరించనుంది. అయితే, దీన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వ్యతిరేకించింది. ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదని తెలిపింది. ఈమేరకు ఈడీ (ED) డిప్యూటీ డైరెక్టర్‌ భానుప్రియ నేడు కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేశారు.

‘‘ఎన్నికల ప్రచారం చేసే హక్కు అనేది.. ప్రాథమిక, రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన హక్కు కిందకు రాదు. మాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడికి ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేదు. చివరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికైనా సరే ఆ వెసులుబాటు లభించలేదు. గతంలో మేం సమన్లు జారీ చేసిన సమయంలోనూ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ఇలాంటి కారణాలే చూపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పేరు చెప్పి విచారణకు రాలేదు. గత మూడేళ్లలో 123 ఎన్నికలు జరిగాయి. సంవత్సరమంతా ఏదో ఒకచోట.. ఏవో ఒక ఎన్నికలు ఉంటూనే ఉన్నాయి. ఇలా ప్రచారం కోసం మధ్యంతర బెయిల్‌ మంజూరుచేస్తే ఏ రాజకీయ నేతను అరెస్టు చేయలేం. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచలేం’’ అని ఈడీ తమ అఫిడవిట్‌లో పేర్కొంది.

కేజ్రీవాల్‌పై తొలి ఛార్జ్‌షీట్‌.. దాఖలు చేయనున్న ఈడీ

ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరుచేయడం అనేది చట్టపరమైన పాలన, సమానత్వానికి విరుద్ధమని దర్యాప్తు సంస్థ అభిప్రాయపడింది. నేరాలకు పాల్పడే నేతలు ఎన్నికల ముసుగులో విచారణ నుంచి తప్పించుకునేందుకు ఇదో అవకాశంగా మారుతుందని పేర్కొంది. అంతేగాక, ప్రజల్లోకి తప్పుడు సందేశం వెళ్తుందని తెలిపింది. రాజకీయ నాయకులు సామాన్య పౌరుల కంటే ఎక్కువ కాదని, చట్టం ముందు అందరూ సమానమేనని అఫిడవిట్‌లో పేర్కొంది.

మద్యం కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చే అంశంపై ధర్మాసనం విచారణ జరిపింది. ఒకవేళ బెయిల్‌ మంజూరు చేస్తే సీఎంగా అధికారిక విధులు నిర్వహించకూడదని తెలిపింది. దీంతో బెయిల్‌పై ధర్మాసనం సానుకూలంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పిటిషన్‌పై శుక్రవారం తీర్పు వెలువడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు