Virat - Yuvraj: ఎవరు కాదన్నా.. కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్‌ సింగ్

ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇవాళ పంజాబ్‌తో బెంగళూరు తలపడనుంది. ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ అయిన విరాట్ కోహ్లీ నుంచి మరోసారి మంచి ఇన్నింగ్స్‌ రావాలని అతడి అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో కోహ్లీపై యువరాజ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Published : 09 May 2024 16:39 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో అత్యుత్తమం ఎవరంటే? ఠక్కున విరాట్, రోహిత్, స్టీవ్‌ స్మిత్, రూట్, కేన్ విలియమ్సన్ పేర్లు చెబుతారు. వీరిలో ఒక్కరినే ఎంచుకోవాలంటే మాత్రం కాస్త తటపటాయిస్తారు. అయితే, ఈ తరం బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీనేనని (Virat Kohli) భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌ వెల్లడించాడు. వచ్చే వరల్డ్ కప్‌లో అతడు కీలక పాత్ర పోషిస్తాడని పేర్కొన్నాడు. జూన్ నుంచి ప్రారంభం కానున్న పొట్టి కప్‌ కోహ్లీకి ఆరోది.  తొలిసారి 2012 ఎడిషన్‌లో ఆడాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌ కూడా కోహ్లీనే కావడం గమనార్హం. 

‘‘ఈ తరంలో అన్ని రికార్డులను కోహ్లీ బద్దలు కొడతాడు. ఎవరు కాదన్నా సరే.. ప్రస్తుత తరానికి అన్ని ఫార్మాట్లలో అతడే బెస్ట్‌ బ్యాటర్. విరాట్‌ కూడా టీ20 వరల్డ్ కప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఆటను అద్భుతంగా అర్థం చేసుకుంటాడు. క్రీజ్‌లో చివరివరకూ అతడు ఉన్నాడంటే.. మ్యాచ్‌ను ముగించగల సత్తా ఉంది. చాలా సందర్భాల్లో విరాట్ ఒంటరిగానే భారత్‌ను గెలిపించిన సందర్భాలూ ఉన్నాయి. ఒక్కసారి కుదురుకుంటే ఎలాంటి లక్ష్యాన్నైనా టీమ్‌ఇండియా ఛేదించినట్లే. ఏ బౌలర్‌పై ఎటాకింగ్‌ గేమ్ ఆడాలి.. కేవలం సింగిల్స్‌తోనే సరిపెట్టుకున్నాడంటే ప్రత్యర్థి బౌలింగ్‌ను గౌరవించి.. ఏమాత్రం అవకాశం వచ్చినా దూకుడు మొదలెట్టేస్తాడు. ఇప్పుడు కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇప్పటికే 500+ స్కోరు చేశాడు. నెట్స్‌లోనూ చాలా తీవ్రంగా శ్రమించడం వల్లే అందరికీ భిన్నంగా రాణించగలుగుతున్నాడు’’ అని యువీ తెలిపాడు. 

ఫామ్‌పై రోహిత్‌కు ఆందోళన: షాన్‌ పొలాక్

‘‘ప్రస్తుత సీజన్‌లో ముంబయి తరఫున రోహిత్ శర్మ పెద్దగా పరుగులు చేయలేదు. అతడి ఫామ్‌ కూడా ఆందోళనకరంగా ఉంది. మంచి ఆరంభం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ముంబయి మరో రెండు మ్యాచ్‌లను మాత్రమే ఆడాల్సి ఉంది. కనీసం ఇందులోనైనా మంచి ప్రదర్శన ఇస్తే.. ప్రపంచ కప్‌ నాటికి సగర్వంగా వెస్టిండీస్‌లో అడుగుపెట్టొచ్చు. గ్రౌండ్‌ షాట్లను అద్భుతంగా ఆడుతున్న అతడు విభిన్నంగా కొట్టేందుకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరుతున్నాడు. స్కూప్ షాట్లకు వెళ్లి వికెట్‌ను సమర్పిస్తున్నాడు. దానిని మార్చుకుంటే రోహిత్‌కు తిరుగుండదు’’ అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని