Harish-Revanth: తప్పుల తడకగా శ్వేతపత్రం.. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి : హరీశ్‌రావు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.

Updated : 20 Dec 2023 16:42 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావు మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. శ్వేతపత్రంలోని అంశాలపై హరీశ్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టాలనే ధోరణి కనపడుతోందని ఆరోపించారు.

‘‘నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం, ప్రజలు ఎంతో ఆశిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నో ఆశలు కల్పించడంతో.. ప్రజలు నమ్మి వారికి అధికారాన్ని కట్టబెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలను నెరవేర్చాలి. ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగించాలి. శ్వేతపత్రంలో ప్రజలు.. ప్రగతి కోణం లేదు. ఇందులో రాజకీయ ప్రత్యర్థులపై దాడి.. వాస్తవాల వక్రీకరణే ఉంది. దీన్ని తెలంగాణ అధికారులు తయారు చేయలేదు. తెలంగాణ అధికారులపై నమ్మకం లేక.. సస్పెండ్ అయిన ఆంధ్రా అధికారులతో నివేదిక తయారు చేయించారు.

సాధారణంగా అప్పులు, జీఎస్‌డీపీ నిష్పత్తిని ప్రగతికి కొలమానంగా తీసుకుంటారు. వాటిని నివేదికలో చూపించలేదు. అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో మనం కింద నుంచి ఐదో స్థానంలో ఉన్నామని ఆర్‌బీఐ చెప్పింది. తెలంగాణ కంటే 22 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తీసుకున్నాయి. కర్ణాటక, రాజస్థాన్‌ కూడా మనకంటే ఎక్కువే అప్పులు తీసుకున్నాయి. ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలు రాలేదు. భవిష్యత్‌ తరాల కోసం ఆస్తుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చాం. మంచినీళ్ల కోసం ప్రజల నుంచి ఎక్కడా ఒక్క రూపాయి వసూలు చేయలేదు. తెచ్చిన అప్పులను ఎలా వినియోగించామనేది ముఖ్యం. అప్పులు తెచ్చి.. రాష్ట్రంలో ఆస్తులు సృష్టించాం. ఎక్కవ మూలధన వ్యయం చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్‌ అవసరాల కోసమే ఖర్చు పెట్టాం. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం రుణాలు తీసుకొచ్చాం. గత 9 ఏళ్లలో రూ.3.36 లక్షల కోట్ల మూలధన వ్యయం జరిగింది. దీన్ని శ్వేతపత్రంలో చూపించలేదు.

ఎస్పీవీ రుణాల వల్ల రాష్ట్ర ఖజానాపై ఎలాంటి భారం పడదు. ఎస్పీవీ రుణాలను సంబంధిత సంస్థలే చెల్లిస్తాయి. సొంత ఆదాయ వనరుల వృద్ధిలో (15.6) తెలంగాణను దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిపాం. ఆరోగ్య రంగంలో వ్యయాలను ఆరు రెట్లు పెంచాం. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు రూ.లక్ష కోట్ల వరకు ఆగిపోయింది. ఎస్పీవీల ద్వారా తీసుకున్న రుణాలను కూడా రాష్ట్ర అప్పులుగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ హామీ లేని రుణాలను కూడా ప్రభుత్వ అప్పులుగా చూపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని వాటిని కూడా చెల్లించాలని తప్పుగా చూపించారు. ఈ శ్వేతపత్రం.. ఒక తప్పుల తడక, అంకెల గారడీ. గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెతుక్కుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని అనేక ప్రభుత్వ సంస్థలు చెప్పాయి. అలాంటి రాష్ట్రం దివాళా తీసిందని ప్రచారం చేస్తే.. పెట్టుబడులు వస్తాయా?ఈ దుష్ప్రచారం రాష్ట్ర ప్రగతిని దెబ్బ తీస్తుంది’’ అని హరీశ్‌రావు అన్నారు.

ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించారు: సీఎం రేవంత్‌ రెడ్డి

శ్వేతపత్రంపై హరీశ్‌రావు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పందించారు. ‘‘కాళేశ్వరాన్ని ₹80వేల కోట్లతో కట్టామనడం అబద్ధం. కాళేశ్వరం కార్పొరేషన్‌ రుణమే ₹97,449 కోట్లు మంజూరైంది. ప్రభుత్వం పెట్టిన ఖర్చు, తెచ్చిన రుణాలు కలిపితే అసలు లెక్క తేలుతుంది. కాళేశ్వరం నీటితో వ్యాపారం చేస్తామని చెప్పి అప్పులు తెచ్చారు. కాళేశ్వరం నీటితో ఏటా ₹5వేల కోట్లు సంపాదిస్తామని చెప్పారు. మిషన్‌ భగీరథతో ₹5,700 కోట్లు సంపాదిస్తామని చెప్పారు. ఇలా నీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పి బ్యాంకులను మభ్యపెట్టి తప్పుడు నివేదికలు ఇచ్చారు. బ్యాంకుల నుంచి అడ్డగోలుగా రుణాలు తీసుకొచ్చారు. ఆర్థిక సంస్థలను తప్పుదోవ పట్టించిన భారాస ప్రభుత్వం.. అత్యధిక వడ్డీకి అడ్డగోలుగా రుణాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని కాగ్‌ నివేదికలో స్పష్టంగా తేల్చింది’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని