Kota: ‘రూ.8 వేలు ఉన్నాయి.. ఐదేళ్ల వరకు రాను’: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం

నీట్ కోచింగ్ కోసం కోటా (Kota) వచ్చిన ఓ విద్యార్థి.. ఆ పరీక్ష ముగిసిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయాడు. 

Published : 09 May 2024 13:44 IST

కోటా: విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్‌ (Rajasthan)లోని కోటా (Kota)లో మరో ఘటన చోటుచేసుకుంది. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతోన్న ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. దానికి ముందు పంపిన సందేశంతో అతడి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

ఆ విద్యార్థి పేరు రాజేంద్ర మీనా. అతడిది రాజస్థాన్‌లోని బమన్‌వాస్‌ ప్రాంతం. రాజేంద్ర నుంచి వచ్చిన సందేశం ఆధారంగా అతడి తండ్రి జగ్‌దీశ్‌ మీనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘నేను ఇంటికి రాను.. వెళ్లిపోతున్నాను. పైచదువులు చదవాలని లేదు. నావద్ద రూ.8వేలు ఉన్నాయి. ఐదు సంవత్సరాల వరకు తిరిగిరాను. నా ఫోన్ అమ్మేస్తాను. నేను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను. నా గురించి బాధపడొద్దని అమ్మకు చెప్పండి. నా దగ్గర మీ అందరి ఫోన్‌ నంబర్లు ఉన్నాయి. ఏడాదికి ఒకసారి తప్పకుండా ఫోన్‌ చేస్తాను’’ అని తన ఫోన్‌ నుంచి కుటుంబానికి మెసేజ్‌ చేశాడు. మే ఆరు నుంచి అతడు కనిపించడం లేదని, ఆరోజు మధ్యాహ్నం తన హాస్టల్ వదిలివెళ్లిపోయాడని జగ్‌దీశ్‌ తెలిపారు. ప్రస్తుతం ఆ విద్యార్థి కోసం గాలిస్తున్నారు. అతడు నీట్ కోచింగ్ కోసం కోటా వచ్చాడని పోలీసులు తెలిపారు. గత ఆదివారం దేశవ్యాప్తంగా ఆ ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. 

అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం..

వివిధ పోటీ పరీక్షల కోచింగ్‌ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన ‘కోటా’ (Kota)లో.. ఇతర రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వచ్చి శిక్షణ పొందుతారు. గత కొంతకాలంగా ఇక్కడ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఇటీవల పలు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా శిక్షణ ఇవ్వాలని సూచించింది. అటు విద్యార్థుల మరణాలను నియంత్రించేందుకు భవనాల చుట్టూ ఇనుప వలలు, గదుల లోపల స్ప్రింగ్‌ ఫ్యాన్లను అమర్చినా.. ఈ తరహా ఘటనలు ఆగకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని