Sanjeev Goenka - KL Rahul: కేఎల్‌తో సంజీవ్‌ గోయెంకా సీరియస్‌ చాటింగ్‌ .. నెట్టింట హాట్‌ టాపిక్‌

తమ ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి హైదరాబాద్‌ చేతిలో ఓటమిపాలు కావడం లఖ్‌నవూ ఫ్రాంచైజీ యజమానికి తీవ్ర అసహనం తెప్పించింది. దానిని కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై చూపించడం నెట్టింట వైరల్‌గా మారింది.

Published : 09 May 2024 13:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మొదట బ్యాటింగ్‌లో విఫలం కావడం.. బౌలింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయలేకపోవడంతో లఖ్‌నవూకు తొలిసారి హైదరాబాద్‌ చేతిలో ఓటమి ఎదురైంది. పవర్‌ ప్లేలో భారీగా పరుగులు చేయడంలో లఖ్‌నవూ వెనుకబడింది. మరోవైపు హైదరాబాద్‌ ఓపెనర్లు మాత్రం 10 ఓవర్లలోనే 166 పరుగుల టార్గెట్‌ను ఛేదించేశారు. ఇదే లఖ్‌నవూ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకాకు తీవ్ర అసహనం తెప్పించింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ (KL Rahul)తో సీరియస్‌గా చర్చిస్తున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కేఎల్ సమాధానం ఇస్తున్నా.. సంజీవ్ మాత్రం అలా కాదంటూ వ్యాఖ్యలు చేయడం ఆ వీడియోల్లో కనిపించింది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

‘‘సంజీవ్ - కేఎల్ రాహుల్‌ సంభాషించుకున్న తీరును చూస్తుంటే సోషల్ మీడియాలో అనసవరంగా కొత్త చర్చకు తెరలేపినట్లు అయింది. అందుకే, ఇలాంటవన్నీ తలుపులు మూసుకొని గదుల్లోనే మాట్లాడుకోవాలి. మైదానంలో చుట్టూ ఎన్నో కెమెరాలు ఉంటాయి. ఏదీ మిస్‌ కాదు. మ్యాచ్ తర్వాత కేఎల్ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు వెళ్తాడు. మ్యాచ్‌ ఫలితం గురించి తప్పకుండా మాట్లాడతాడు. అలాంటప్పుడు ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు’’ అని జియో సినిమా వేదికగా ఓ ఎక్స్‌పర్ట్‌ వెల్లడించారు. సోషల్ మీడియాలోనూ కామెంట్లు వచ్చాయి. 

‘‘అందరి ముందు సంజీవ్ ప్రవర్తన సరిగ్గాలేదు. కెమెరాలన్నీ అటువైపే ఉన్నప్పుడు ఓటమిపై చర్చించాల్సిన అవసరం లేదు. కేఎల్ వెంటనే ఈ ఫ్రాంచైజీ నుంచి బయటకు వచ్చేయాలి’’

‘‘లఖ్‌నవూ యజమాని తీరు అన్‌ప్రొఫెషనల్‌గా ఉంది. కెప్టెన్‌తో సీరియస్‌ మోడ్‌లో మాట్లాడటం ఏంటి? గేమ్‌లో ఓటములు సహజం’’

‘‘కెప్టెన్ పట్ల గోయెంకా ప్రవర్తించిన తీరు ఆమోదయోగ్యం కాదు. టాలెంట్ కలిగిన క్రికెటర్లతో ఇలా సంభాషించడం తగదు’’

అలా ఆడటం కంటే.. ఔట్ కావడం బెటర్: మ్యాథ్యూ హేడెన్

‘‘పవర్‌ప్లేలో లఖ్‌నవూ కేవలం 27 పరుగులను మాత్రమే చేసింది. అక్కడే ఆ జట్టు సగం వెనుకబడిపోయింది. ఇలా ఆడటం కంటే ఔట్ అవ్వండని చెబుతా. ఓవర్‌కు కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసే పిచ్‌ కాదు. టాప్‌ ఆర్డర్‌లో ఎవరో ఒకరు దూకుడు ప్రదర్శించి ఉంటే బాగుండేది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్‌ క్లాసెన్ వంటి హిట్టర్లు ఉన్న ప్రత్యర్థి జట్టుకు 160-170 స్కోరు ఏమాత్రం సరిపోదు. కనీసం ఓవర్‌కు పది చొప్పున ఉంటేనే మ్యాచ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. హైదరాబాద్‌ ఓపెనర్లు అలవోకగా టార్గెట్‌ను ఛేదించేశారు’’ అని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యాత మ్యాథ్యూ హేడెన్ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు