Mamata Banerjee: దేశంలో ప్రజాపాలన నెలకొల్పేందుకు శ్రమించాలి: మమత

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్‌లో శాంతిభద్రతలు మెరుగ్గానే ఉన్నాయని సీఎం మమతా బెనర్జీ అన్నారు. దేశంలో భాజపా పాలనను అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు శ్రమించాలన్నారు.

Published : 14 Feb 2023 01:15 IST

కోల్‌కతా: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నిక(lok sabha elections)ల్లో భాజపా(BJP) సర్కార్‌ను ఓడించి, అరాచక పాలనను అంతమొందించి ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు దేశమంతా శ్రమించాలని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(Mamata banerjee) పిలుపునిచ్చారు. సోమవారం ఆమె బెంగాల్‌ అసెంబ్లీలో మాట్లాడారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఇటీవల బెంగాల్‌లో అవినీతి, హింస పెరిగిపోయాయంటూ చేసిన వ్యాఖ్యలపై దీదీ మండిపడ్డారు. తమ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దేశంలోని మిగతా ప్రాంతాల కన్నా మెరుగ్గానే ఉందని చెప్పారు. బీఎస్‌ఎఫ్‌ జవాన్లు సరిహద్దుల్లోని గ్రామాల్లో నివసిస్తున్న అమాయకులను బలితీసుకుంటున్నా.. కేంద్రం మౌనం వహిస్తోందన్నారు. ఈ అంశంపై పట్టనట్టు వ్యవహరిస్తూ.. నిజనిర్ధారణ బృందాలను సైతం పంపించడంలేదని దీదీ విమర్శించారు. 

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, తమ ప్రభుత్వం అవినీతియమంటూ విద్వేషపూరిత ప్రచారం చేస్తోన్న భాజపాకు ప్రజలే గుణపాఠం నేర్పుతారని దీదీ అన్నారు. కేవలం భాజపాలోనే నిజాయతీపరులు ఉన్నట్టు.. ఇతర పార్టీల్లో మాత్రం దొంగలు ఉన్నట్టుగా భాజపా ప్రవర్తన ఉందని మండిపడ్డారు. భాజపా వాషింగ్‌మిషన్‌ లాంటిదని.. కళంకిత నేతలు ఆ పార్టీలో చేరగానే సాధువుల్లా మారిపోతారంటూ ఎద్దేవా చేశారు. బొగ్గు కుంభకోణంలో తమ పార్టీ నేతలను అరెస్టు చేస్తారు గానీ.. సంబంధిత అధికారులపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రపంచ ప్రేమికుల దినోత్సవం రోజున ఆవులను కౌగిలించుకోవాలని పిలుపునిచ్చి ఆ తర్వాత ఉపసంహరించుకోవడంపైనా దీదీ తనదైన శైలిలో స్పందించారు. ఒకవేళ హగ్‌ చేసుకొనేటప్పుడు ఆవులు మనల్ని గాయపరిస్తే భాజపా పరిహారం చెల్లిస్తుందా? వాటి దాడిలో గాయపడిన వారికి రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ముందు ఆమోదం తెలపండి అని మమత కేంద్రానికి సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని