Politics: అనర్హత వేటు పడినా.. శిందేనే ముఖ్యమంత్రి: ఫడణవీస్‌

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందేపై అనర్హత వేటు పడదని, ఒకవేళ పడినా.. ఎమ్మెల్సీగా ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పేర్కొన్నారు.

Published : 29 Oct 2023 17:11 IST

ముంబయి: శివసేనలోని రెండు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్లు ప్రస్తుతం సుప్రీం కోర్టు (Supreme Court) విచారణలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్ల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకునే విషయంలో అసెంబ్లీ స్పీకర్‌కు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం తుది అవకాశం ఇచ్చింది. ఈ పరిణామాల నడుమ ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)పై అనర్హత వేటు పడదని, ఒకవేళ పడినా.. ఎమ్మెల్సీగా ఆయన తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపడతారని తెలిపారు.

ఓ వార్తాసంస్థ కార్యక్రమంలో ఫడణవీస్‌ మాట్లాడుతూ.. ‘మొదటి విషయం ఏంటంటే.. సీఎం శిందే అనర్హతకు గురికారు. ఒకవేళ అనర్హత వేటు పడినప్పటికీ.. ఆయన్ను శాసనమండలికి ఎంపిక చేసి, తిరిగి ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తాం. వచ్చే ఎన్నికల్లో ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోనే బరిలోకి దిగుతాం’ అని తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీం కోర్టు ధర్మాసనం అక్టోబరు 30న తిరిగి విచారణను ప్రారంభించనున్న తరుణంలో.. ఫడణవీస్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ఎప్పుడు?

సీఎం శిందే సహా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసిన స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌పై సుప్రీం కోర్టు గత నెలలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ల పరిష్కారానికి నిర్ణీత షెడ్యూల్‌ను ఖరారు చేయాలని సెప్టెంబరు 18న ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ నెల 17న మరోసారి విచారణ చేపట్టింది. తమ ఆదేశాలను స్పీకర్‌ ధిక్కరించలేరని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లను ఎప్పటికల్లా పరిష్కరిస్తారో తెలిపేందుకు స్పీకర్‌కు తుది అవకాశమిస్తూ.. విచారణను అక్టోబరు 30వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని