ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం ఎప్పుడు?

శివసేన రెండు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల పరిష్కారానికి నిర్ణీత షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు మంగళవారం తుది అవకాశం ఇచ్చింది.

Published : 18 Oct 2023 03:41 IST

మహారాష్ట్ర స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది అవకాశం

దిల్లీ: శివసేన రెండు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పరస్పరం దాఖలు చేసిన అనర్హత పిటిషన్ల పరిష్కారానికి నిర్ణీత షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు మంగళవారం తుది అవకాశం ఇచ్చింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే సహా ఆయన విధేయులైన పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేసిన స్పీకర్‌పై గతంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఠాక్రేకు విధేయత చూపిన ఎమ్మెల్యేలపై శిందే వర్గం సైతం అనర్హత పిటిషన్లను దాఖలు చేసింది. ఈ పిటిషన్ల పరిష్కారానికి నిర్ణీత షెడ్యూల్‌ను ఖరారు చేయాలని సెప్టెంబరు 18న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.  మంగళవారం ఈ అంశంపై ధర్మాసనం విచారణ జరపగా..దసరా సెలవుల్లో స్పీకర్‌తో వ్యక్తిగతంగా చర్చలు జరిపి విధివిధానాలు సూచిస్తామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. దీంతో స్పీకర్‌కు తుది అవకాశమిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణను అక్టోబరు 30వ తేదీకి వాయిదా వేసింది.

తన వద్ద పెండింగ్‌లోని అనర్హత పిటిషన్లపై మంగళవారం మహారాష్ట్ర స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ స్పందించారు. ఏ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం అవుతుందో అనే విషయాన్ని తాను తెలుసుకోవలసి ఉందని చెప్పారు. త్వరలోనే తన నిర్ణయాన్ని సుప్రీం కోర్టుకు సమర్పిస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని