సీఏఏపై విపక్షాల భేటీ: దీదీ, మాయావతి దూరం

పౌరసత్వ చట్టం, ఎన్నార్సీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు నేడు భేటీ కానున్నాయి. అయితే ఈ భేటీ పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి

Updated : 13 Jan 2020 16:35 IST

దిల్లీ: పౌరసత్వ చట్టం, ఎన్నార్సీపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు నేడు భేటీ కానున్నాయి. అయితే ఈ భేటీకి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు హాజరుకావట్లేదు. ప్రతిపక్షాల ఐక్యత చాటే ఉద్దేశంతో పిలుపునిచ్చిన ఈ సమావేశానికి కీలక నేతలు దూరంగా ఉండటం గమనార్హం. 

ఇటీవల కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌, వామపక్ష కార్యకర్తల మధ్య ఉద్రిక్త ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణలపై అసహనంగా ఉన్న తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాల సమావేశానికి తాను హాజరుకావట్లేదని స్పష్టం చేశారు. ‘సీఏఏ, ఎన్సార్సీకి వ్యతిరేకంగా ముందు నేనే ఉద్యమం ప్రారంభించాను. అయితే సీఏఏ-ఎన్నార్సీ పేరుతో కాంగ్రెస్‌, వామపక్షాలు ఉద్యమానికి బదులుగా విధ్వంసం సృష్టిస్తున్నాయి. వారి ద్వంద్వ సిద్ధాంతాలను మేం ఎప్పటికీ సహించబోం. విపక్ష భేటీకి హాజరయ్యే ప్రసక్తే లేదు’ అని దీదీ గట్టిగా చెప్పారు. 

అటు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా సమావేశానికి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. గతేడాది సెప్టెంబరులో రాజస్థాన్‌లో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య పొసగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్‌ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరైతే అది రాజస్థాన్‌లోని పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరుస్తుందని మాయావతి ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా ఈ సమావేశానికి హాజరుకావట్లేదు. భేటీ గురించి తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, అందుకే తాము దూరంగా ఉంటున్నామని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు