బిహార్‌లో ఎన్‌ఆర్‌సీ అమలు చెయ్యం: నితీశ్‌

పట్నా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)ని ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. తాజాగా.. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు.

Published : 14 Jan 2020 00:46 IST

పట్నా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)ని ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తూ వచ్చాయి. తాజాగా.. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. బిహార్‌లో ఎన్‌ఆర్‌సీని ఎట్టిపరిస్థితుల్లోను అమలు చేసేది లేదని స్పష్టం చేశారు. సీఏఏపై పార్లమెంటులో ప్రశ్నించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సోమవారం బిహార్‌ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
‘దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు చేయాల్సిన అవసరం లేదు, దీన్ని ఎవరూ సమర్థించడం లేదు. ఎన్‌ఆర్‌సీపై జరుగుతున్న వివాదం గురించి ప్రధాని నరేంద్రమోదీ స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను’ అని సీఎం నితీశ్‌కుమార్‌ అన్నారు. బిహార్‌లో సీఏఏను అమలు చేసే అవసరమే లేదని ఆయన పేర్కొన్నారు. భాజపాయేతర రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, కేరళతో పాటు పలు రాష్ట్రాలు సీఏఏను అమలు చెయ్యమని ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలోకి ఎన్డీయే మిత్రపక్షమైన బిహార్‌ కూడా చేరింది. 
మే 15 నుంచి మే 28 వరకు ఎన్‌ఆర్‌సీని చేపడతామని బిహార్‌ ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత సీఎం నితీశ్‌కుమార్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందేందుకు నితీశ్‌ జేడీయూ పార్టీ మద్దతుగా ఓటేసింది. ఆ సమయంలో జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఏఏకి మద్దతుగా ఓటేయడాన్ని ఆయన విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని