సచిన్‌ పైలట్‌ తొలగింపునకు గవర్నర్‌ ఆమోదం!

రాజస్థాన్‌ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రతిపాదనకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా ఆమోదం తెలిపారు. అలాగే ఇద్దరు మంత్రులు విశ్వేందర్‌ సింగ్‌, రమేశ్‌ మీనాల తొలగింపునకు కూడా ఆమోదముద్ర వేశారు........

Updated : 14 Jul 2020 16:53 IST

జైపుర్‌: రాజస్థాన్‌ ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ను ఆ పదవి నుంచి తొలగించాలన్న ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రతిపాదనకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా ఆమోదం తెలిపారు. అలాగే ఇద్దరు మంత్రులు విశ్వేందర్‌ సింగ్‌, రమేశ్‌ మీనాల తొలగింపునకు కూడా ఆమోదముద్ర వేశారు. 

సీఎల్పీ సమావేశంలో సచిన్‌కు ఉద్వాసన పలుకుతూ తీర్మానం చేసిన తర్వాత గహ్లోత్‌ నేరుగా గవర్నర్‌ నివాసానికి చేరుకున్నారు. అక్కడ సచిన్‌, మంత్రులను తొలగించాలనుకుంటున్న నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన గహ్లోత్‌.. ‘‘చివరకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ కుట్ర ఆరు నెలలుగా జరుగుతోంది. ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేసేందుకు భాజపా ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా భాజపా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిదికాదు. 30 మంది ఎమ్మెల్యేలు కలిసి పార్టీని ఏర్పాటు చేయలేరు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ పరోక్షంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలను హెచ్చరించే ప్రయత్నం చేశారు.

మరోవైపు సచిన్‌ వర్గంలోని రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముకేశ్‌ భాకర్‌ను కూడా పదవి నుంచి తొలగించారు. దీంతో ఆయన గహ్లోత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ అంతర్గత ఎన్నికల్లో గెలిచి పదవిలోకి వచ్చిన తనను గహ్లోత్‌ ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. 

మరోవైపు రాజస్థాన్‌లో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల ప్రమాణస్వీకారానికి తేదీని కూడా ఖరారు చేసినట్లు సమాచారం. జులై 16 సాయంత్రం 4:30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉండనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని