నిధులు మళ్లించి... తొలి స్థానంలో ఉన్నామని దుష్ప్రచారమా?

ఎస్సీ, ఎస్టీల ఓట్లతో అధికారం దక్కించుకున్న జగన్‌రెడ్డి వారికి అమలుచేయాల్సిన ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించింది కాక... ఉప ప్రణాళిక అమలులో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 25 Jan 2023 05:42 IST

మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం

ఈనాడు, అమరావతి: ఎస్సీ, ఎస్టీల ఓట్లతో అధికారం దక్కించుకున్న జగన్‌రెడ్డి వారికి అమలుచేయాల్సిన ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించింది కాక... ఉప ప్రణాళిక అమలులో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో ఉందని దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. ‘ఎస్సీ, ఎస్టీల్లో సాధికారత తీసుకొచ్చేలా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు అమలుచేశారు. జగన్‌ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు ఏం చేసిందో చెప్పగలరా? నవరత్నాల్లో పెట్టే ఖర్చును దళిత, గిరిజనుల లెక్కల్లో చూపడం వంచించడమే. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మొత్తం బడ్జెట్‌ రూ.1.41 లక్షల కోట్లలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.52,462 కోట్లు వెచ్చించారు. జగన్‌రెడ్డి గత నాలుగేళ్లలో రూ.48వేల కోట్లు ఖర్చుచేశారు. ఇదీ నవరత్నాల్లో పెట్టినదే. విదేశీవిద్య కింద తెదేపా ప్రభుత్వం 1,200 మంది దళిత, గిరిజనులను విదేశాలకు పంపింది. జగన్‌ ఒక్క దళితుడ్నయినా విదేశాలకు పంపారా?’ అని నక్కా ఆనంద్‌బాబు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని