Nara Lokesh - Yuvagalam: బీసీలకు 34 శాతం ‘స్థానిక’ కోటా

ఎన్టీఆర్‌ స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. చంద్రబాబు 34 శాతానికి పెంచారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated : 29 Jan 2023 07:24 IST

అధికారంలోకి రాగానే అమలు చేస్తాం
యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌

ఈనాడు- తిరుపతి, ఈనాడు డిజిటల్‌- చిత్తూరు, న్యూస్‌టుడే- కుప్పం పట్టణం, గ్రామీణం, శాంతిపురం: ఎన్టీఆర్‌ స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. చంద్రబాబు 34 శాతానికి పెంచారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన ఏకైక సీఎం జగన్‌ అని విమర్శించారు. ఈ నిర్ణయంతో 16వేల మంది బీసీలు స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కోల్పోయారని ధ్వజమెత్తారు. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లను తిరిగి 34 శాతానికి తెస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఎమ్మెల్యేల సంఖ్యలో ముందు ఒకటి పోతుందా.. వెనుక ఒకటి పోతుందా చూడాలని వ్యాఖ్యానించారు. పాదయాత్ర రెండోరోజు అయిన శనివారం లోకేశ్‌ చిత్తూరు జిల్లా గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో 9.3 కి.మీ. నడిచారు. విద్యార్థులు, బీసీలు, రైతులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘జగన్‌ పాదయాత్రలో ఉపకులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ కార్పొరేషన్ల ఛైర్‌పర్సన్లు ఏం చేస్తున్నారో తెలీదు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సమాఖ్యలు ఏర్పాటు చేసి, నిధులిచ్చి ఆదుకున్నారు. తమ అభ్యున్నతికి ఒక్క రుణమూ ఇవ్వని ఈ ప్రభుత్వానికి బీసీలు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. వారిలో నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు సాధికారిక సమితులు ఏర్పాటు చేశాం’ అని చెప్పారు.

క్వారీలను లాక్కున్నారు..

చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో క్వారీలపై వడ్డెర్లకు అధికారం చంద్రబాబు కల్పించారని లోకేశ్‌ పేర్కొన్నారు. ‘ఇక్కడ ఒక దొంగరెడ్డి మైనింగ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వడ్డెర్లను వాళ్ల సొంత క్వారీల్లో రాళ్లు కొట్టుకోనివ్వకుండా లాక్కుని తన అనుచరులకు ఇచ్చేశారు’ అని మండిపడ్డారు. మా ప్రభుత్వం వచ్చాక క్వారీలను తిరిగి వడ్డెర్లకు అప్పగిస్తామన్నారు.

రాముడే తేలుస్తాడు..

‘మా అమ్మ నన్ను ఎంతో పద్ధతిగా పెంచింది. ఒక్క పదం తూలినా ఆమె ఏమంటుందోనని భయపడుతుంటా. చంద్రబాబు రాముడే.. అయితే ఆయన సహనానికీ హద్దుంటుంది. అధికార పార్టీ నాయకులు ఆమెను అవమానిస్తూ శాసనసభలో వ్యాఖ్యలు చేసిన తర్వాత మన రాముడిలోనూ మార్పు కనిపించింది. వారి సంగతి రాముడే తేలుస్తాడు’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. తెదేపా హయాంలో ఆదరణ కింద బీసీలకు పంపిణీ చేసేందుకు కొన్న పరికరాలను వైకాపా ప్రభుత్వం పక్కనపడేసిందన్నారు. నువ్వు పేరు మార్చుకుని మీ పార్టీ రంగులు వేసుకుని లబ్ధిదారులకు ఇవ్వచ్చు కదా! ఎవరు వద్దన్నారని జగన్‌ను ప్రశ్నించారు. 

వ్యవసాయ మంత్రి కోర్టు దొంగ

‘ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళ్తారు. వ్యవసాయమంత్రి కోర్టులోనే పత్రాలు దొంగతనం చేసిన కోర్టు దొంగ’ అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వలేదన్నారు. ‘గిట్టుబాటు లేక టమాటా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ట్రాక్టరు టమాటాలను రోడ్డున పడేసి ఉద్యమిద్దాం.. నాతోపాటు రండి. మన రాయలసీమ పౌరుషం ఎక్కడికి పోయింది? రైతుల కోసం బ్రిటానియా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైతే.. ఈ సీఎం జాదూరెడ్డి వచ్చి నాకు ఎంత అని అడగటంతో వాళ్లు వెనక్కి వెళ్లిపోయారు. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రతి పంటకూ గిట్టుబాటు ధర కల్పిస్తాం. మోటార్లకు మీటర్ల ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. ఒక్క పరిశ్రమనూ తేలేక, ఉన్నవాటిని పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్న జగన్‌ను ఓడించడానికి యువత పాదయాత్రలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు జీవితాంతం కుప్పంలోనే పోటీ చేస్తారని, బాలకృష్ణ హిందూపురంలో, తాను మంగళగిరిలోనే పోటీ పడతామని లోకేశ్‌ స్పష్టం చేశారు.   

పాదయాత్రకు తగిన భద్రత కల్పించలేదు

లోకేశ్‌ పాదయాత్రకు పోలీసులు తగినంత భద్రత కల్పించలేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌ ఆరోపించారు. 500 మందితో భద్రత కల్పిస్తామని ప్రకటించి, 50 మందినైనా నియమించలేదని చెప్పారు. దీనిపై డీజీపీకి లేఖ రాశామన్నారు.


ఆప్యాయంగా పలకరిస్తూ.. అక్కున చేర్చుకుంటూ..

యువగళం పాదయాత్రలో అడుగులు వేసేందుకు రెండో రోజు యువతీయువకులు భారీగా తరలివచ్చారు. పలమనేరు- క్రిష్ణగిరి జాతీయ రహదారిపై పలు గ్రామాల వద్ద వేచిఉన్న రైతులు, మహిళలు, యువతను కలిసి లోకేశ్‌ మాట్లాడారు. చిన్నారులను ఎత్తుకుని, వృద్ధులను హత్తుకుని ఆప్యాయంగా పలకరించారు. 16 నెలల్లో అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని.. మీ ఎమ్మెల్యే చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని కుప్పం ప్రజలకు భరోసా ఇచ్చారు. శనివారం ఉదయం 9.50 గంటలకు గుడుపల్లె మండలం పీఈఎస్‌ వైద్య కళాశాల నుంచి లోకేశ్‌ రెండోరోజు పాదయాత్ర మొదలైంది. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు లోకేశ్‌ను కలిసి ఉపకారవేతనాలు రావడం లేదని చెప్పారు. కడపల్లెలో చంద్రబాబు ఇల్లు నిర్మించుకుంటున్న ప్రాంతానికి ఎదురుగా బీసీ సంఘాల నాయకులతో లోకేశ్‌ మాట్లాడారు. అక్రమ కేసుల బాధితులైన తెదేపా నాయకులకు అధికారంలోకి రాగానే ప్రాధాన్యమిస్తామని భరోసా ఇచ్చారు. కనమలదొడ్డి టమాటా మార్కెట్‌లో రైతులతో భేటీ అయ్యారు. పాదయాత్ర అనంతరం పెద్దబొమ్మనపల్లి సమీపంలో రాత్రి బస చేశారు. లోకేశ్‌ వెంట ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, మాజీ మంత్రులు అమరనాథరెడ్డి, చినరాజప్ప, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, చిత్తూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, తదితరులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు