ఖర్గేతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల సమావేశం

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు.

Published : 01 Feb 2023 03:52 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడోయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యేందుకు వెళ్లిన నాయకులు మంగళవారం ఉదయం శ్రీనగర్‌లో ఖర్గేను కలిశారు. కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్‌బాబు, సంపత్‌కుమార్‌ తదితరులు ఆయనను కలిసి రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. భారత్‌ జోడో యాత్ర మాదిరిగానే ‘హాథ్‌సే హాథ్‌ జోడో అభియాన్‌’ను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారికి ఖర్గే సూచించారు. ఎన్నికల సంవత్సరం అయినందున ఈ రెండు నెలల పాటు ప్రజల ముందుండి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై రూపొందించిన ఛార్జిషీట్‌లను ప్రతి ఇంటికి చేరేలా చొరవ తీసుకోవాలని ఖర్గే సూచించినట్లు ముఖ్య నాయకుడొకరు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


సర్పంచి దంపతుల ఆత్మహత్యాయత్నంపై ఏం చెబుతారు?: రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సర్పంచులకు ఒక్క రూపాయీ బాకీ లేమని చెప్పే మంత్రులు నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌లో సర్పంచి దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు సంబంధించి ఏం సమాధానం చెబుతారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనపై ఆయన మంగళవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పు చేసిన పాపానికి నందిపేట సర్పంచి దంపతులు వాణి, తిరుపతిలు కలెక్టరేట్‌లోనే ఆత్మహత్యకు యత్నించారు. హైదరాబాద్‌లో ఏసీ గదుల్లో కూర్చుని సర్పంచులకు ఒక్క రూపాయీ బాకీలేమని ప్రకటించే మంత్రులు దీనికి ఏం జవాబు చెబుతారు?’ అని రేవంత్‌ నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని