‘నువ్వు తెలుగుదేశం వాడివిరా!’.. యువకుడిపై ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆగ్రహం

నాలుగేళ్లుగా ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలంటూ పలువురు యువకులు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని నిలదీశారు.

Updated : 02 Apr 2023 04:25 IST

కార్వేటినగరం, న్యూస్‌టుడే: నాలుగేళ్లుగా ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలంటూ పలువురు యువకులు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిని నిలదీశారు. చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం పంచాయతీ పరిధిలోని విజయమాంబపురం, బిల్లుదొన, పట్టెంవారిండ్లు, బీసీకాలనీల్లో శనివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. విజయమాంబపురానికి చెందిన యువకులు, మహిళలు సమస్యలపై ఉపముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వం నాలుగేళ్లుగా డీఎస్సీ నిర్వహించలేదని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు. గ్రామంలో సెల్‌ టవర్‌ లేదని, బస్టాండ్‌ లేదని, రోడ్లు, మురుగునీటి కాలువలు అధ్వానంగా ఉన్నాయని వాపోయారు. భానుచంద్రారెడ్డి అనే యువకుడు సమస్యలపై ఉపముఖ్యమంత్రిని ప్రశ్నించడంతో ఆగ్రహించిన ఆయన.. ‘నువ్వు తెలుగుదేశానికి చెందిన వాడివిరా’ అంటూ ఆవేశానికి గురయ్యారు. అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించి గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వెనుతిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని