Nara Lokesh:దోచుకోవడానికే జగనన్న ఇళ్ల పథకం

పేదలకు 30 లక్షల ఇళ్లు కట్టిస్తామన్న జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పటి వరకు అయిదు ఇళ్లే నిర్మించారని, దోచుకోవడానికే జగనన్న ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

Updated : 07 May 2023 05:51 IST

సెంటు పట్టాల పేరుతో రూ.7 వేల కోట్లు కొట్టేశారు
30 లక్షల ఇళ్లు కడతామని అయిదే నిర్మించారు
యువగళంలో నారా లోకేశ్‌

ఈనాడు, కర్నూలు: పేదలకు 30 లక్షల ఇళ్లు కట్టిస్తామన్న జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పటి వరకు అయిదు ఇళ్లే నిర్మించారని, దోచుకోవడానికే జగనన్న ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. కర్నూలు లేబర్‌ కాలనీలో 600 మంది పేదలు ఇళ్లకోసం దరఖాస్తు చేస్తే ఒక్కరికీ మంజూరుచేయలేదని ఆరోపించారు. సెంటు పట్టాల పేరుతో రూ.7వేల కోట్లు దోచుకున్నారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. కర్నూలులో శనివారం సాయంత్రం యువగళం పాదయాత్రలో భాగంగా నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి టి.జి.భరత్‌తో కలిసి  లోకేశ్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పింఛన్లు తీసేశారని ఓ వృద్ధుడు, ఓ దివ్యాంగురాలు తనను కలిసి కన్నీటిపర్యంతమయ్యారన్నారు. కర్నూలు 45వ వార్డులో గతంలో 1200 మందికి పింఛన్లు ఇస్తే, వాటిని 350కి కుదించేశారని దయ్యబట్టారు. కర్నూలులో మంచినీటి ఎద్దడి ఉందని, మురుగుకాలువలతోపాటు కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మేయర్‌ రామయ్యలకు దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు సౌకర్యాలు కల్పించడంపై లేదని మండిపడ్డారు.   జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు ఛార్జీలు ఎనిమిదిసార్లు పెంచారని... దీంతో పేదలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కర్నూలు బస్టాండ్‌ వద్ద చెప్పులు కుట్టుకునే నాగన్నకు రోజంతా పనిచేస్తే వచ్చే రూ.400 కుటుంబ పోషణకే చాలడం లేదు. గత నెలలో అతని ఇంటి విద్యుత్తు బిల్లు రూ.3,500 వచ్చింది. పింఛనుకు రూ.500 సొంత డబ్బు జతచేసి విద్యుత్తు బిల్లులు చెల్లించారు’ అన్నారు.

దోచుకుంది చాలు... తిరిగి ఇచ్చేయండి

పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డిని ఉద్దేశించి లోకేశ్‌ మాట్లాడుతూ ‘దోచుకుంది చాలు.... ఇక తిరిగి ఇచ్చేయండి. రూ.వంద కోట్ల వక్ఫ్‌ భూములను కొట్టేసిన పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. సర్వే నంబరు 524లో 10.64 ఎకరాల భూమిని మీరు కబ్జా చేసిన ఆధారాలు బయటపెడుతున్నా’ అంటూ కల్లూరు మైనారిటీ మసీదు కమిటీ ఇచ్చిన వివరాలను విడుదల చేశారు.  కర్నూలు అగ్రికల్చర్‌ మార్కెట్‌ యార్డ్‌ వద్ద తనను కలిసి క్రిస్టియన్‌ సంఘ ప్రతినిధులతో లోకేశ్‌ మాట్లాడారు.

వైకాపా లీగల్‌సెల్‌ న్యాయవాదుల అరెస్టు

బళ్లారి చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్టాండు వైపు నడిచి వస్తున్న లోకేశ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కర్నూలుకు న్యాయరాజధాని ముద్దు అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపేందుకు వైకాపా లీగల్‌సెల్‌ న్యాయవాదులు సన్నద్ధమయ్యారు. ర్యాలీగా వస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని