Gali Janardhana Reddy: ‘గాలి’ కుటుంబానికి ఎదురుదెబ్బ

వివాదాస్పద మైనింగ్‌ వ్యాపారి, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కుటుంబానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.

Updated : 14 May 2023 07:53 IST

ఒక్క జనార్దనరెడ్డికే విజయం

హొసపేటె, న్యూస్‌టుడే: వివాదాస్పద మైనింగ్‌ వ్యాపారి, మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి కుటుంబానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. జనార్దనరెడ్డి మినహా పోటీలో నిలిచిన ఆయన కుటుంబసభ్యులంతా పరాజయం పాలయ్యారు. సోదరులు సోమశేఖరరెడ్డి, కరుణాకరరెడ్డి భాజపా తరఫున బరిలోకి దిగగా, జనార్దనరెడ్డి, ఆయన భార్య లక్ష్మీ అరుణ తమ సొంత పార్టీ కల్యాణ రాజ్యప్రగతి పక్ష(కేఆర్‌పీపీ) అభ్యర్థులుగా పోటీ పడ్డారు. గంగావతి స్థానం నుంచి జనార్దనరెడ్డి.. తన సమీప ప్రత్యర్థి ఇక్బాల్‌ అన్సారీ(కాంగ్రెస్‌)పై 8,366 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కానీ కేఆర్‌పీపీ తరఫున నిలిచిన 46 మంది అభ్యర్థులూ ఓటమి పాలయ్యారు. గాలి కుటుంబానికి కంచుకోటగా భావించే బళ్లారి నగర నియోజకవర్గంలోనూ జనార్దనరెడ్డి తన భార్యను గెలిపించలేకపోయారు. ఇక్కడ భాజపా తరఫున పోటీ చేసిన సోదరుడు సోమశేఖరరెడ్డికీ విజయం దక్కలేదు. ఓటర్లు కాంగ్రెస్‌ అభ్యర్థి నారా భరత్‌రెడ్డికి పట్టం కట్టారు. హరపనహళ్లి నుంచి భాజపా తరఫున పోటీ చేసిన జనార్దనరెడ్డి మరో సోదరుడు కరుణాకరరెడ్డి కూడా ప్రత్యర్థి లతా మల్లిఖార్జున్‌ చేతిలో ఓడారు. ఇక్కడ సోదరుడిని ఓడించడానికి గాలి జనార్దనరెడ్డి.. స్వతంత్ర అభ్యర్థి మల్లిఖార్జున్‌కు మద్దతిచ్చారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు భాజపా తరఫున బరిలో నిలిచిన గాలి సన్నిహితులు రవాణాశాఖమంత్రి బి.శ్రీరాములు (బళ్లారి రూరల్‌) టి.హెచ్‌.సురేశ్‌ బాబు (కంప్లి)లకు నిరాశే ఎదురైంది. వీరిద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని