Nara Lokesh: రాష్ట్రంలో జగన్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ పెత్తనం

‘రాష్ట్రంలో జగన్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ (జేఎంసీ) తప్ప ఇతర మైనింగ్‌ కంపెనీ లేకుండా చేస్తున్నారు. వైకాపా నాయకులు లాక్కున్న గనులు తెదేపా అధికారంలోకి రాగానే వెనక్కి తీసుకుంటాం... వారు లూటీచేసిన మొత్తాన్ని కక్కిస్తాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు. 

Updated : 22 May 2023 06:41 IST

వారు లూటీ చేసిన సొమ్మును కక్కిస్తాం
30 లక్షల మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ 

ఈనాడు, కర్నూలు: ‘రాష్ట్రంలో జగన్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ (జేఎంసీ) తప్ప ఇతర మైనింగ్‌ కంపెనీ లేకుండా చేస్తున్నారు. వైకాపా నాయకులు లాక్కున్న గనులు తెదేపా అధికారంలోకి రాగానే వెనక్కి తీసుకుంటాం... వారు లూటీచేసిన మొత్తాన్ని కక్కిస్తాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రకటించారు.  నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం శివారులో ఆదివారం గనుల యజమానులు, కార్మికులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. 117 మైనర్‌ బ్లాక్స్‌కు వేలం వేస్తే రూ.28 కోట్ల ఆదాయమే వచ్చిందని.. మిగిలింది జగన్‌ జేబులోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఏయే జీవోలు తెచ్చి గనుల యజమానులపై ఎంత భారం మోపారన్న విషయాలను చెప్పి ఆయా జీవోలన్నీ రద్దు చేసి పాత విధానాన్ని అమలుచేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. గనుల్లో పనిచేసే కార్మికులకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా అందజేస్తామని హామీ ఇచ్చారు.

బెదిరించి సొంతం చేసుకుంటున్నారు

‘జగన్‌ అండ్‌ కో గనుల యజమానుల్ని బెదిరించి లాక్కుంటున్నారు.. ఎప్పుడూ లేని విధంగా విజిలెన్స్‌ దాడులు జరుగుతున్నాయి. యజమానులపై అక్రమ కేసులు పెట్టడం.. భారీ అపరాధ రుసుములు విధించి వేధించడం ద్వారా గనులను జగన్‌ తన ఆధీనంలోకి తీసుకున్నారని ఆరోపించారు. న్యాయస్థానాల ఆదేశాలు, కంటెంప్ట్‌ నోటీసులను అధికారులు చెత్తబుట్టలో వేస్తున్నారన్నారు. గనుల తవ్వకాల అనుమతులు గడువు తీరితే పునరుద్ధరించడం లేదని.. రాష్ట్రంలో ప్రస్తుతం 20వేల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయన్నారు. కన్సిడరేషన్‌ పన్ను, సెక్యూరిటీ డిపాజిట్‌, ప్రీమియం టాక్స్‌, రాయల్టీ తగ్గించి సూక్ష్మ, చిన్న పరిశ్రమలను ఆదుకుంటామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌ ఆ హామీలను తుంగలో తొక్కారన్నారు. జగన్‌ పాలనలో గనుల యజమానులు  వ్యాపారమే చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు.

వ్యవస్థల్ని జగన్‌ ధ్వంసం చేశారు

గనుల రంగాన్ని జగన్‌ ధ్వంసం చేశారని లోకేశ్‌ పేర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులకు రాయల్టీ వసూలు చేసే హక్కులు ఇచ్చారని ఆరోపించారు. గనుల యజమానుల్ని వేధించి బయటకు పంపేస్తే... జగన్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఒకటే ఉంటుందని... అప్పుడు వారికి కావాల్సిన చట్టాలు చేసుకోవచ్చని చూస్తున్నారని ఆరోపించారు. ఫ్యాక్షనిస్టులు రాష్ట్రాన్ని ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థగా తయారుచేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా పాలించలేదన్నారు. రాష్ట్రంలోని గనులు, పది వేలకు పైగా ప్రాసెసింగ్‌ యూనిట్లు, అనుబంధ సంస్థల్లో 30 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని..జగన్‌ ప్రభుత్వ చెత్త నిర్ణయాల కారణంగా వారందరి ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికే వేల మంది రోడ్డున పడ్డారన్నారు. తెదేపా హయాంలో ఎప్పుడూ మైనింగ్‌ యజమానుల్ని వేధించలేదని, విజిలెన్స్‌ దాడులు చేయించలేదన్నారు. పలు రకాల పన్నులు, రుసుములు తగ్గించిన విషయాన్ని గుర్తుచేశారు.  కార్యక్రమంలో బనగానపల్లి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి బి.సి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మైనింగ్‌పై ఆధారపడి జీవిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గనుల యజమానులు, కార్మికులు తమ గోడును లోకేశ్‌కు వెళ్లబోసుకుని వారు ఏవిధంగా నష్టపోతున్నామన్న వివరాల్ని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని