NCP - Ajit pawar: ఎన్సీపీలో విస్ఫోటం.. నిలువునా చీలిన పవార్‌ పార్టీ

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపు. రాజకీయ ఉద్ధండుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నిట్టనిలువునా చీలిపోయింది. ఏడాది కిందట శివసేనలో చీలిక వచ్చినట్లుగానే ఇప్పుడు ఎన్సీపీ ముక్కలైంది.

Updated : 03 Jul 2023 08:32 IST

శిందే ప్రభుత్వంలో చేరిన అజిత్‌
ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం
మంత్రులుగా మరో 8 మంది ఎన్సీపీ నాయకులు
చర్యలు తప్పవని శరద్‌ పవార్‌ హెచ్చరిక
తమదే అసలైన పార్టీ అన్న అజిత్‌

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపు. రాజకీయ ఉద్ధండుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నిట్టనిలువునా చీలిపోయింది. ఏడాది కిందట శివసేనలో చీలిక వచ్చినట్లుగానే ఇప్పుడు ఎన్సీపీ ముక్కలైంది. పార్టీ సీనియర్‌ నేత, పవార్‌కు స్వయానా అన్న కుమారుడైన అజిత్‌ పవారే పార్టీని చీల్చారు. ఆ వెంటనే ప్రభుత్వంలో చేరిపోయారు. ఏక్‌నాథ్‌ శిందే ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా, మరో 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం ముంబయిలో చోటుచేసుకున్న ఈ పరిణామం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో శరద్‌ పవార్‌ పుణెలో ఉన్నారు. పార్టీని చీల్చిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అమెరికాలో మోదీ గొప్పగా చెప్పిన ప్రజాస్వామ్యం ఇదేనా అని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. అజిత్‌ పవార్‌ ప్రభుత్వంలో చేరడంతో జితేంద్ర అవధ్‌ను ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ నియమించింది. ప్రస్తుత పరిస్థితిపై చర్చించడానికి ఈ నెల 5వ తేదీన ముంబయిలో పార్టీ సమావేశం నిర్వహించాలని పవార్‌ నిర్ణయించారు. కొద్దికాలంగా శరద్‌ పవార్‌ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న అజిత్‌ పవార్‌ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆదివారం ఉదయం ముంబయిలోని తన అధికారిక నివాసం దేవ్‌గిరిలో కొంత మంది పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

ఆ సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే, సీనియర్‌ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ తదితరులు హాజరయ్యారు. కొంత సేపటి తర్వాత సుప్రియ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవికి అజిత్‌ రాజీనామా చేశారు. దానిని వెంటనే స్పీకరు రాహుల్‌ నర్వేకర్‌ ఆమోదించారు. పార్టీ నేతలతో సమావేశం ముగించుకుని వారితో కలిసి అజిత్‌ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నరు రమేశ్‌ బైస్‌ ఆయనతో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. 8 మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో ఛగన్‌ భుజ్‌బల్‌, దిలీప్‌ వాల్సే పాటిల్‌, హసన్‌ ముష్రిఫ్‌, ధనంజయ్‌ ముండే, అదితి తత్కారే, ధర్మారావ్‌ అత్రం, అనిల్‌ పాటిల్‌, సంజయ్‌ బన్సోడే ఉన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం శిందే, ఉప ముఖ్యమంత్రి ఫడణవీస్‌, స్పీకరు నర్వేకర్‌, డిప్యూటీ స్పీకరు నరహరి జిర్వాల్‌, ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్‌ పటేల్‌ హాజరయ్యారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ఉన్నారు. ఇప్పుడు రెండో డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు.

ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సీఎం ఏక్‌నాథ్‌ శిందేతో అజిత్‌ పవార్‌ సమావేశమయ్యారు. అప్పటి నుంచే స్తబ్దుగా ఉన్న ఆయన అకస్మాత్తుగా ప్రభుత్వంలో చేరడం ఎన్సీపీలో కలకలం సృష్టించింది. ఆ పార్టీకి మొత్తం 53 మంది ఎమ్మెల్యేలుండగా అజిత్‌కు 29 మంది మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు 40 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమకు మద్దతు తెలిపారని మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ బవన్‌కులే తెలిపారు. ఇటీవల శరద్‌ పవార్‌ తన కుమార్తె సుప్రియా సూలే, ప్రఫుల్‌ పటేల్‌లను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. అప్పటి నుంచి అజిత్‌ అసంతృప్తిగానే ఉన్నారు. ఇదే అదనుగా ముఖ్యమంత్రి శిందే వర్గం పావులు కదిపి అజిత్‌ పవార్‌తో జరిపిన సంప్రదింపులు ఫలించాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పట్నాలో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో రాహుల్‌ గాంధీతో వేదిక పంచుకోవడం, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడంపై శరద్‌ పవార్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్నీ అజిత్‌ వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. మరోవైపు.. పార్టీ అధ్యక్ష పదవి అప్పగిస్తారని ఆశించినా ఇవ్వకపోవడంతో తిరుగుబాటు చేసినట్లు సమాచారం.

ఏడాది తిరగ్గానే..

2019లో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన భాజపా, శివసేన ఫలితాల అనంతరం ముఖ్యమంత్రిగా ఎవరుండాలనే విషయంలో విభేదాలొచ్చి విడిపోయాయి. దీంతో ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శరద్‌ పవార్‌ మద్దతివ్వకపోవడంతో 80 గంటల్లోనే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి ఉద్ధవ్‌ ఠాక్రే మహా వికాస్‌ అఘాడీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడూ ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది జూన్‌లో మరోసారి మహా రాజకీయాల్లో కలకలం రేగింది. శివసేనను ఏక్‌నాథ్‌ శిందే చీల్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మళ్లీ ఇప్పుడు ఏడాది తిరగ్గానే ఎన్సీపీని చీల్చి అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికలయ్యాక నాలుగుసార్లు ప్రమాణ స్వీకారాలు జరగ్గా మూడుసార్లు అజిత్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

రాజకీయ కలలెన్నో..

మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అజిత్‌ పవార్‌. తన అనూహ్య నిర్ణయాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. 63 ఏళ్ల అజిత్‌ పవార్‌ శరద్‌ పవార్‌కు అన్న కుమారుడు. అజిత్‌ తండ్రి అనంతరావు పవార్‌. 1982లో అజిత్‌ రాజకీయాల్లోకి వచ్చారు. క్షేత్రస్థాయి బలం ఉన్న నేతగా, పాలనలో నిపుణుడిగా పేరొందిన ఆయనకు రాజకీయ ఆకాంక్షలెన్నో ఉన్నాయి. ఆయన 2019లో బారామతి నుంచి 1.65 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. గతంలో కాంగ్రెస్‌, ఎన్సీపీ ప్రభుత్వంలోనూ ఆయన 15 ఏళ్లపాటు మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. 1991లో ఎంపీగా గెలిచారు. శరద్‌ పవార్‌ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడంతో అజిత్‌ రాష్ట్రంలో కీలకపాత్ర పోషించారు. ఆరుసార్లు బారామతి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఎమ్మెల్యేలంతా నా వెంటే: అజిత్‌

ఎమ్మెల్యేలంతా తన వెంటే ఉన్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్‌ పవార్‌ తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లోనూ ఎన్సీపీ గుర్తుపైనే పోటీ చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీకి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోందని తెలిపారు.

అత్యంత సన్నిహితులే షాకిచ్చిన వేళ..

శరద్‌ పవార్‌కు అత్యంత సన్నిహితులైన దిలీప్‌ వాల్సే పాటిల్‌, ఛగన్‌ భుజ్‌బల్‌ తిరుగుబాటు చేయడం కలకలం రేపింది. వారిద్దరూ పవార్‌కు గట్టి మద్దతుదారులు. శివసేనలో ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న భుజ్‌బల్‌ 1991లో కాంగ్రెస్‌లో చేరారు. 1999లో పవార్‌ వెంట ఎన్సీపీలోకి వచ్చారు. అప్పటి నుంచీ ఆయన వెంటే ఉంటున్నారు. తెల్గీ స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని రెండేళ్లపాటు జైలులో ఉండి వచ్చారు. శరద్‌ పవార్‌ పీఏగా కెరీర్‌ను ప్రారంభించిన వాల్సే పాటిల్‌ స్పీకరుగా, మంత్రిగా పని చేశారు. అంబేగావ్‌ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

పార్టీ మద్దతు లేదు: ఎన్సీపీ

అజిత్‌ పవార్‌ ఇంట్లో సమావేశం జరిగే సమయంలో శరద్‌ పవార్‌ పుణెలో ఉన్నారు. ఆ సమావేశం గురించి తనకు సమాచారం లేదని ఆయన చెప్పారు. మరోవైపు అజిత్‌ వర్గానికి పార్టీ మద్దతు లేదని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్‌ తపసే స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, జిల్లాల అధ్యక్షులు, తాలూకాల నేతలు, యువజన, మహిళా నేతలు శరద్‌ పవార్‌ వెంటే ఉన్నారని ఓ వీడియో ప్రకటనలో తపసే తెలిపారు.


బాబాయితో మనస్పర్థలెందుకు?

శరద్‌ పవార్‌కు మగపిల్లలు లేరు. ఏకైక కుమార్తె సుప్రియా సూలే వివాహం చేసుకుని సింగపూర్‌లో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆమె భారత్‌కు వచ్చి ఎంపీగా గెలిచినా దిల్లీకే పరిమితమయ్యారు. ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి రారని శరద్‌ పవార్‌ పలు సందర్భాల్లో చెప్పారు. దీంతో రాజకీయ వారసుడు అజిత్‌ అని అందరూ భావించారు. పార్టీలోనూ ఆయనకు గౌరవం లభించింది. అయితే రాజకీయాల్లో సుప్రియా సూలే చురుగ్గా వ్యవహరిస్తుండడం అజిత్‌ ఇబ్బందిగా మారింది. తనకు, తన కుమారుడు పార్థ్‌కు పార్టీలో సముచిత స్థానం ఉండదేమోనన్న ఆందోళన ఆయనలో నెలకొంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ఆశించినా ఆ పదవీ దక్కలేదు. ఇటీవల సుప్రియా సూలే, ప్రఫుల్‌ పటేల్‌లకు కార్యనిర్వాహక అధ్యక్ష పదవులు కట్టబెట్టడం ఆయనలో మరింత అసంతృప్తికి కారణమైంది. సాగునీటి ప్రాజెక్టుల్లో ఆయనపై కేసులూ ఇబ్బందికరంగా మారాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని