Pawan Kalyan: మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం

‘రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం. వైకాపా పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదు. వైకాపా పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు?

Updated : 10 Jul 2023 08:18 IST

ఒంటరి అతివల సమాచారాన్ని సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు..
వైకాపా దోపిడీని బహిర్గతం చేసిన కాగ్‌
మీడియా ముందుకు రావడానికి జగన్‌కు ఎందుకు భయం?
మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలు తీసుకురారేం?
వారాహి విజయయాత్ర సభలో పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, ఏలూరు: ‘రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం. వైకాపా పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియదు. వైకాపా పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి కుటుంబంలో ఎంత మంది ఉన్నారు? వారిలో మహిళలు ఎందరు? వితంతువులున్నారా? అని ఆరా తీస్తున్నారు. ప్రధానంగా ఒంటరి మహిళలే లక్ష్యంగా సమాచారం సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జగన్‌ నువ్వు ఇంతమంది ఉసురు పోసుకుంటున్నావు.. తప్పకుండా అనుభవిస్తావు’ అని ధ్వజమెత్తారు. రెండో విడత వారాహి విజయ యాత్రను ఆయన ఆదివారం ఏలూరులో ప్రారంభించారు. పెదపాడు మండలం వట్లూరులోని క్రాంతి కల్యాణమండపం నుంచి జిల్లాకేంద్రం ఏలూరు పాతబస్టాండు సమీపంలోని అంబేడ్కర్‌ కూడలి వరకు యాత్ర చేశారు. రాత్రి అక్కడి బహిరంగ సభలో ప్రసంగించారు.

కాగ్‌ ప్రశ్నలకు సమాధానమేదీ?

‘గతేడాది ప్రభుత్వం చేసిన ఖర్చులపై కాగ్‌ నివేదికలో అక్రమాలన్నీ బయటపడ్డాయి. రాష్ట్రంలో చేసే ఖర్చులు ఎవరికీ తెలియకుండా ప్రభుత్వం దోపిడీకి తెర తీస్తోంది. ఈ దోపిడీపై కాగ్‌ 25 లోపాలను ఎత్తిచూపింది. రాష్ట్రాభివృద్ధి పేరుతో రూ.22,504 కోట్లు అప్పు చేసి లెక్కాపత్రం లేకుండా దోచేశారు. రహదారులను అభివృద్ధి చేస్తామని రూ.4,754 కోట్లు తీసుకుని ఏం చేశారు? మీరు రోడ్లు వేస్తే 37,942 ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? 14,230 మంది అమాయకులు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటారు? జగన్‌.. నువ్వు రూ.1.18 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశావ్‌? కాగ్‌ అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు? బడ్జెట్లో చూపించకుండా దోచేసిన రూ.లక్షల కోట్ల సొమ్ము గురించి సమాధానం చెప్పాలి..’ అని పవన్‌ ప్రశ్నించారు.

జగన్‌ను ఏకవచనంతోనే పిలుస్తా

‘నేను ప్రజల అభివృద్ధి గురించి, సమాజ పురోగతి గురించి మాట్లాడుతున్నా. జగన్‌ మాత్రం సభ్యత లేకుండా నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి కించపరుస్తున్నారు. నాకు రాజకీయాలు అవసరం లేదు. సినిమాలు చేసుకుని హాయిగా ఉండగలను కానీ దగా పడుతున్న ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చా. వైకాపా నాయకులు నా తల్లిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. రాజకీయాలతో సంబంధం లేని నా భార్య గురించి మాట్లాడతారు. ఇంత దిగజారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే జగన్‌ను ఏలూరు సభ నుంచి ఏకవచనంతోనే మాట్లాడతా’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

మద్యం సొమ్ముతోనే ఓట్లు కొంటారు

‘మద్యాన్ని నిషేధిస్తానని మాట ఇచ్చి సీఎం పదవి పొందిన వ్యక్తి.. ఆ హామీని గాలికొదిలేశారు. ఏడాదికి మద్యం ద్వారా రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. అందులో రూ.97 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. మిగిలింది జగన్‌ ఖజానాకు వెళుతోంది. ఆ సొమ్ముతోనే వచ్చే ఎన్నికల్లో మీ ఓట్లు కొంటారు. మద్యం దుకాణాల్లో డిజిటల్‌ లావాదేవీలేవి? ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 32 మంది చనిపోయినా పట్టించుకోని గొప్ప ప్రభుత్వం మనల్ని పాలిస్తోంది. చనిపోయిన వారి భార్యల తాళిబొట్లను జగనే తెంచాడు’ అని పవన్‌ తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు గుప్పించారు.

నాకు జగన్‌లా అడ్డగోలు సంపాదన లేదు

‘నేను హైదరాబాద్‌లో ఉంటానని సీఎం పదేపదే అంటున్నారు. నేను నీలాగా అడ్డగోలుగా సంపాదించడం లేదు. మీ నాన్నలా మా నాన్న సీఎం కాదు. ఆయనలా ప్రతి పనికి 6 శాతం కమీషన్లు తీసుకునే పరిస్థితి లేదు. మా నాన్న ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి. నేను సినిమాలు తీసి వచ్చిన డబ్బులు కష్టాల్లో ఉన్న కౌలు రైతులకు పంచుతున్నా. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నా. నువ్వెప్పుడైనా ప్రజల వద్దకు వచ్చావా? పరదాలు, బారికేడ్లు కట్టుకుని వెళుతున్నావు. అలా వచ్చి వెళితే తాడేపల్లిలో ఉంటేనేం.. దాచేపల్లిలో ఉంటేనేం. ఇండియా టిక్‌టాక్‌, చైనా ఫేస్‌బుక్‌ బ్యాన్‌ చేశాయి. నువ్వు మాత్రం రాష్ట్ర పరిస్థితులు ప్రజలకు తెలియకుండా చేసేందుకు జీవోలను బ్యాన్‌ చేస్తున్నావు. జగన్‌.. నీ ప్రభుత్వం పోగానే ప్రజలు వాడవాడలా వెంట పడతారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఒక్కసారీ మీడియా ముందుకు రాలేదు. మీడియా అంటే భయం. ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందనే మీడియాను దూరం పెడతారు’ అని పవన్‌ కల్యాణ్‌ ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని