Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో కొత్త పొత్తులు!

కర్ణాటక రాజకీయాల్లో పాత మిత్రులు మళ్లీ ఏకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలి విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది.

Updated : 16 Jul 2023 09:29 IST

ఎన్డీయేలోకి జేడీఎస్‌?

ఈనాడు, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో పాత మిత్రులు మళ్లీ ఏకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలి విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ భారీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టడానికి మిగిలిన రెండు విపక్షాలైన భాజపా, జేడీఎస్‌ ఒక్కటయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. జాతీయస్థాయిలో ఈ నెల 18న ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో నిర్వహించే ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో ఈ అంశంపై కీలక ప్రకటన చేస్తారని జేడీఎస్‌ వర్గాలు వెల్లడించాయి. విధానసభలోనూ ఎన్డీయే విపక్షపాత్ర పోషించనుంది.

‘కుమార’ సారథ్యం

కర్ణాటక విధానసభ ఎన్నికల ఫలితాలు వెల్లడై రెండు నెలలు దాటి, శాసనసభ సమావేశాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు రెండో అతిపెద్ద పార్టీ- భాజపా విపక్ష నేతను ఎన్నుకోలేదు. ఈ ఆలస్యం వెనుక కొత్త రాజకీయ సమీకరణం ఉండొచ్చని స్పష్టమవుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో జేడీఎస్‌ శాసనసభా పక్షనేత కుమారస్వామి మాట్లాడుతూ తమ పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే పొత్తులు తప్పవని తేల్చిచెప్పారు. చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ ‘జేడీఎస్‌ నేడు భాజపా బీ-టీమ్‌’ అంటూ వ్యాఖ్యానించగా ఇందుకు బదులిచ్చిన కుమారస్వామి ‘మీవల్లే మేము ఒక్కటి కావాల్సి వస్తోంది’ అంటూ బదులిచ్చారు. 2018 ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ స్వయంగా తమతో కలసి సాగాలని ఆహ్వానించినట్లు కుమారస్వామి వెల్లడించారు. అప్పట్లోనే ప్రధాని మాట విని ఉంటే తాను ఐదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేవాడినన్నారు. కాంగ్రెస్‌తో కలసి తప్పుచేశానని చెప్పారు.
* సోమవారం దిల్లీకి వెళ్లనున్న కుమారస్వామి ప్రధానమంత్రితో ప్రత్యేకంగా చర్చించనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేసేందుకు నిర్ణయించగానే విధానసభలోనూ భాజపా, జేడీఎస్‌ల కూటమి ఏర్పాటుకానుంది. ఈ కూటమికి కుమారస్వామి నాయకత్వ బాధ్యతలు చేపట్టి విధానసభ విపక్ష నేతగా వ్యవహరించే అవకాశాలున్నట్లు జేడీఎస్‌ పార్టీవర్గాలు తెలిపాయి. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు చోటిచ్చే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 135 స్థానాల్లో గెలుపొందగా, భాజపా 66, జేడీఎస్‌ 19 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు