80కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ఖరారు!

పార్టీలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గెలుపు గుర్రాల ఎంపిక వ్యవహారాన్ని కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ దాదాపుగా ఓ కొలిక్కి తెచ్చింది.

Updated : 23 Sep 2023 05:58 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల సీట్లపై పీటముడి
5గంటలకుపైగా స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం
నేడు హస్తం గూటికి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈనాడు, దిల్లీ: పార్టీలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న గెలుపు గుర్రాల ఎంపిక వ్యవహారాన్ని కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ దాదాపుగా ఓ కొలిక్కి తెచ్చింది. కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు సభ్యులు సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు... మొత్తంగా 80కు పైగా స్థానాల్లో అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఒకే అభ్యర్థి ఉన్న స్థానాలతోపాటు ఇద్దరు చొప్పున పోటీలో ఉన్న చాలా నియోజకవర్గాల్లో దరఖాస్తులను వడపోసి జాబితాను రూపొందించారు. సమావేశంలో బాబా సిద్ధిఖీ, జిగ్నేష్‌ మేవానీ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, ఏఐసీసీ కార్యదర్శులు పీసీ విష్ణునాథ్‌, మన్సూర్‌ అలీఖాన్‌, రోహిత్‌ చౌదరి, పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు పాల్గొన్నారు. గురువారం ఏడు గంటలపాటు, శుక్రవారం అయిదు గంటలపాటు మొత్తంగా 12 గంటలపాటు స్క్రీనింగ్‌ కమిటీ సమావేశం సాగింది. ఎంపిక చేసిన జాబితాను శనివారం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపాలని నిర్ణయించారు. అక్కడ అనుమతి లభించిన తర్వాత... ఈ నెలాఖరుకు లేదా అక్టోబరు మొదటి వారంలో 80కిపైగా స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు. ఎస్టీ, ఎస్సీలతోపాటు బీసీల్లోనూ సామాజిక సమతౌల్యం పాటించాలని ప్రయత్నిస్తుండడంతో సుమారు 20 స్థానాల విషయంలో స్క్రీనింగ్‌ కమిటీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది.

ఎల్బీనగర్‌, జూబ్లీహిల్స్‌లపై ప్రతిష్టంభన 

ఉమ్మడి ఆదిలాబాద్‌, మెదక్‌ వంటి జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికలో పెద్దగా ఇబ్బంది పడకపోయినా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని నియోజకవర్గాల విషయంలో వివిధ అంశాలు స్క్రీనింగ్‌ కమిటీకి సవాల్‌ విసిరాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఎల్బీనగర్‌ స్థానానికి పీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధు యాస్కీ దరఖాస్తు చేశారు. ఆయనకు టికెట్‌ కేటాయింపు విషయంలో రాష్ట్ర ముఖ్య నాయకులెవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోయినా స్థానిక నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ నియోజకవర్గానికి చెందిన నేతలు మల్‌రెడ్డి రాంరెడ్డి, దరిపెల్లి రాజశేఖర్‌రెడ్డి, జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, జితేందర్‌ తదితరులు రెండు రోజులుగా దిల్లీలో మకాం వేసి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌, కోమటిరెడ్డిలను కలిసి మధుయాస్కీకి టికెట్‌ ఇవ్వవద్దని కోరారు. ఇన్నాళ్లూ సర్వేయే ఆధారమని చెప్పారని, సర్వే ప్రకారమే టికెట్‌ ఇవ్వాలని, తమలో ఎవరికిచ్చినా కలిసి పని చేస్తామని, మధుయాస్కీకి ఇస్తే మాత్రం పని చేయబోమని తేల్చి చెప్పారు. దీంతో ఈ స్థానంపై ప్రతిష్టంభన నెలకొంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని జూబ్లీహిల్స్‌ టికెట్‌ కోసం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, సీనియర్‌ నేత అజారుద్దీన్‌ పోటీ పడుతున్నారు. ఇక్కడా స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. మల్కాజిగిరి నియోజకవర్గంపై ఉత్కంఠ కొనసాగుతుండటంతో దాన్ని పక్కనపెట్టినట్లు తెలిసింది.

  • మహేశ్వరం విషయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తారని భావించినా ఆయన రాకపోవడం, బడంగ్‌పేట మేయర్‌ చిగురింత పారిజాత నరసింహారెడ్డికి సర్వేలో మొగ్గు రావడంతో ఆమె పేరును ఖరారు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వికారాబాద్‌ స్థానానికి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. చేవెళ్ల నుంచి ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యుడు భూపతిగళ్ల మహిపాల్‌, భీంభరత్‌, వసంతం పోటీ పడినా సర్వేలో భూపతిగళ్ల మహిపాల్‌కు మొగ్గు ఉండడంతో ఆయన వైపే స్క్రీనింగ్‌ కమిటీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. 
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి, నకిరేకల్‌ స్థానాల విషయంలో స్పష్టత కరవైంది. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరేశాన్ని నకిరేకల్‌, తుంగతుర్తిల్లో ఎక్కడ నుంచి బరిలోకి దించాలనే దానిపై తర్జనభర్జన సాగినట్లు తెలిసింది.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పాలేరు టికెట్‌ కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పోటీపడుతున్నారు. తుమ్మలను ఖమ్మం పంపాలని చూస్తున్నా ఆయన ఆసక్తి చూపకపోవడంతో తుది నిర్ణయానికి రాలేకపోయినట్లు సమాచారం.
  • ఇల్లెందు నుంచి అత్యధికంగా 32 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ముఖ్య అనుచరుడు భద్రాద్రి-కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్యకు టికెట్‌ ఇవ్వాలని పట్టుపడుతున్నారు. కానీ ఇక్కడ కోయ, లంబాడా సామాజిక వర్గాల సమస్య తలెత్తింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట స్థానాలను కోయలకు కేటాయిస్తున్న నేపథ్యంలో వైరా, ఇల్లెందు లంబాడాలకు కేటాయించాల్సిన పరిస్థితి తలెత్తిందని సమాచారం.
  • మహబూబాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో నర్సంపేట మినహా ఆరు స్థానాలు ఎస్టీ రిజర్వుడే... ఇందులో భద్రాచలం, పినపాక, ములుగులను కోయ, మహబూబాబాద్‌, డోర్నకల్‌లను లంబాడా అభ్యర్థులకు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సామాజిక సమతుల్యత సాధనకు ఇల్లెందును లంబాడాలకు కేటాయించాలనే చర్చ సాగింది. ఇక్కడ లంబాడా సామాజికవర్గానికి చెందిన నేతలు బెల్లయ్య నాయక్‌, అజ్మీరా శంకర్‌, బాణోత్‌ విజయలక్ష్మి, లక్ష్మణ్‌ నాయక్‌లు ప్రముఖంగా పోటీపడుతున్నారు. పొంగులేటికి ఇచ్చిన హామీ, సామాజిక సమతుల్యత నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ నియోజకవర్గాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. 

దిల్లీలో ఆశావహుల యత్నాలు

టికెట్లు ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు దిల్లీలో మకాం వేసి ఏఐసీసీ ముఖ్య నేతలు, రాష్ట్ర ముఖ్య నేతల వద్ద ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ కోటాలో తమకు సీట్లు కేటాయించాలని పున్న కైలాష్‌ నేత(మునుగోడు), గంట రాములు యాదవ్‌(పెద్దపల్లి), డాక్టర్‌ కురవ విజయ్‌(గద్వాల) ముఖ్య నేతలకు వినతిపత్రాలు సమర్పించారు.


సీనియర్ల సీట్లతో ఇబ్బందులు

సూర్యాపేట నియోజకవర్గం టికెట్‌ విషయంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్‌గా ఉన్న దామోదర్‌రెడ్డికే అవకాశం ఇవ్వాలని స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుల్లో కొందరంటే... గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రమేశ్‌రెడ్డికి ఇవ్వాలని మరికొందరు అభిప్రాయపడినట్లు తెలిసింది. 2018 శాసనసభ ఎన్నికల సమయంలో దామోదర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారు. రమేశ్‌రెడ్డికి నల్గొండ ఎంపీ టికెట్‌ ఇస్తామంటూ నాటి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి కుంతియాతోపాటు అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీపత్రం రాసిచ్చారు. కానీ, చివరకు ఉత్తమ్‌ ఎంపీగా బరిలోకి దిగాల్సి వచ్చింది. నాడిచ్చిన హామీని తప్పామని, ఈ సారి రమేశ్‌రెడ్డికి ఎలా న్యాయం చేయాలనే ప్రశ్న వారికి చిక్కుముడిగా మారినట్లు తెలిసింది. దామోదర్‌రెడ్డి వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోవడం, వయసుపైబడటం చర్చకు వచ్చినట్లు సమాచారం. 

జనగామలో పొన్నాల లక్ష్మయ్య వరుస ఓటములు, వయసుపైబడటంతో ఆయన స్థానంలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వైపు స్క్రీనింగ్‌ కమిటీ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సుభాష్‌రెడ్డి, మదన్‌మోహన్‌రావుల మధ్య పోటీ నెలకొంది. 2018లో ఎల్లారెడ్డి నుంచి జాజాల సురేందర్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చారు. సురేందర్‌ గెలిచిన తర్వాత భారాసలో చేరారు. సుభాష్‌రెడ్డికి జహీరాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ టికెట్‌ మదన్‌మోహన్‌రావుకు ఇచ్చారు. ఆయన ఎంపీగా ఓడిపోయారు. మదన్‌మోహన్‌రావు ఇప్పుడు ఎల్లారెడ్డి టికెట్‌ అడుగుతుండడంతో ఈ స్థానంలో ప్రతిష్టంభన ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని