Ongole Land Scam: ప్రకాశం వైకాపాలో ‘భూ ప్రకంపనలు’

ఒంగోలులో ఇటీవల వెలుగుచూసిన నకిలీ పత్రాల కుంభకోణం వైకాపాలో ప్రకంపనలు రేపుతోంది. ఈ పంచాయితీ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) చేరింది.

Updated : 21 Oct 2023 09:35 IST

సీఎంవోకు చేరిన నకిలీ పత్రాల వ్యవహారం
బాలినేని వర్సెస్‌ అధిష్ఠానంగా పరిణామాలు
రెండో రోజూ సీఎంవోలో పంచాయితీ

ఈనాడు, అమరావతి, ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలులో ఇటీవల వెలుగుచూసిన నకిలీ పత్రాల కుంభకోణం వైకాపాలో ప్రకంపనలు రేపుతోంది. ఈ పంచాయితీ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంఓ) చేరింది. సీఎంవో అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలతో జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌ తాడేపల్లి వెళ్లారు. సీఎంఓలో అదనపు కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ ఐజీ సీతారామాంజనేయులుతో భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు సీఎంవోలో జరిగిన పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. గురువారం మాజీమంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డిని కలిసి మాట్లాడారు. ఈ కేసును తేల్చాలని ప్రకాశం కలెక్టర్‌, ఎస్పీలకు తాను చెప్పినా సరిగా స్పందించడం లేదని వారికి గట్టిగా చెప్పాలని కోరారు. దీంతోకలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌లను శుక్రవారం పిలిపించి బాలినేని సమక్షంలోనే ధనుంజయరెడ్డి మాట్లాడడం గమనార్హం. నిందితుల పేర్లను బయటపెట్టి తర్వాత దర్యాప్తును కొనసాగించండని బాలినేని కోరినట్లు తెలిసింది. ‘దర్యాప్తులో లభించే ఆధారాల మేరకే నిందితుల వివరాలను వెల్లడించడం.. అరెస్టు చేయడమనేది విధానం’ అని ఎస్పీ తెలిపినట్లు సమాచారం. ‘రాజకీయంగా నన్ను ఇబ్బందిపెట్టేలా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చేలా ఈ కేసు విషయమై లీకులను ఇస్తున్నారు’ అని బాలినేని ఈ సందర్భంగా ఆరోపించినట్లు తెలిసింది. కేసులో ఇప్పటివరకూ వివిధ శాఖల సహకారంతో చేసిన దర్యాప్తు వివరాలను ఎస్పీ చూపించినట్లు తెలిసింది.

సిబ్బందిని తీసుకుంటున్నా.. బాలినేని

సీఎంలో జరిగిన పంచాయతీపై బాలినేని కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. అందులో.. ‘ఒంగోలులో వెలుగుచూసిన కుంభకోణాన్ని సీఐడీ సహకారంతో నిగ్గు తేలుస్తాం. ఇందులో ఎంతటివారున్నా వదిలిపెట్టేది లేదు. అవసరమైతే సీఐడీ సహకారాన్ని తీసుకుని కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ధనుంజయరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. సీఎం కార్యదర్శి హామీ ఇచ్చినందున...నేను సరెండర్‌ చేసిన భద్రతా సిబ్బందిని తిరిగి తీసుకుంటున్నా’ అని వెల్లడించారు.

జరిగింది ఇదీ...

ఒంగోలులో నకిలీ దస్తావేజులు, పత్రాలతో జరిగిన భూ కుంభకోణం విషయంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుయాయులే సూత్రధారులంటూ ప్రత్యర్థులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. స్పందించిన ఆయన ఈ వ్యవహారంలో ఎంతటి వారున్నా శిక్షించాలని అధికారులను కోరారు. కేసు విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అసలైన వారిని పట్టుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు తనకు ప్రభుత్వం కల్పించిన వ్యక్తిగత భద్రతా సిబ్బంది వద్దంటూ  డీజీపీకి లేఖ రాయడమే కాకుండా గన్‌మెన్‌లను సరెండర్‌ చేశారు. నకిలీ పత్రాల కుంభకోణంలో ఇప్పటి వరకు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన అధికార పార్టీలోని ఇద్దరు ప్రజాప్రతినిధులు, మరో ఇద్దరు సూత్రధారులపై చర్యలకు ఉపక్రమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. వారందరి పేర్లు బయటికి వస్తే ప్రకాశం జిల్లాలో తమకు గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని వైకాపా అధినాయకత్వం భావిస్తోందని..వారి సూచనల మేరకే ఉన్నతాధికారులు కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారంటూ విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్యాప్తుపై బాలినేని గన్‌మెన్‌లను సరెండర్‌ చేయడం.. పంచాయితీ సీఎంవోకు చేరడం తీవ్ర కలకలం రేపింది.

వివాదాలు సృష్టిస్తూ.. రూ. కోట్లు కొల్లగొడుతూ..

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరు భూ కుంభకోణానికి తెర లేపారు. గుంటూరు, చిలకలూరిపేట, ఇతర ప్రాంతాల నుంచి రూ.100, రూ.50 రూ.20 స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేశారు. అధికారుల పేర్లతో తమకు కావాల్సిన ముద్రలు, రౌండ్‌ సీల్స్‌ తయారు చేసుకున్నారు. పాత బాండ్‌ పత్రాలు,నకిలీ వీలునామాలు, పాత తేదీలతో ఒప్పంద పత్రాలు రూపొందించారు. ఒంగోలు, నగర శివారు ప్రాంతాల్లోని వివాదాస్పద భూములపై కన్నేశారు. భూ యజమానుల మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి జీపీఏ పొందడం, పాత తేదీలతో ఒప్పందాలు తయారు చేసి ఆ భూములను వివాదాల్లోకి లాగారు. తద్వారా యజమానులను బెదిరించి రూ. కోట్లు దండుకున్నారు.

కుంభకోణం.. అధికారానికి ప్రాణసంకటం

ఒంగోలు, ముక్తినూతలపాడు, మంగమూరు రోడ్డు, మామిడిపాలెం, రాజీవ్‌నగర్‌, కర్నూలు రోడ్డు, కొప్పోలు తదితర ప్రాంతాల్లోని పొలాలు, స్థలాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకుని సాగిన కుంభకోణంలో రూ.కోట్లల్లో చేతులు మారాయి. ఈ దందాకు అధికార పార్టీలోని పలువురు కీలక నాయకులు సహాయం చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మొత్తం 19మంది పాత్ర ఉందని గుర్తించినప్పటికీ.. పోలీసులు ఇప్పటి వరకు కొందరినే అరెస్టు చేశారు. ఈ పరిణామాలు బాలినేనికి రాజకీయంగా ఇబ్బందికరంగా  మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని