Balineni Srinivasa Reddy: అవి లంచాలు కాదు.. పార్టీ ఫండ్‌గా ఇచ్చారు

‘‘మాది తాతల కాలం నుంచే బాగా ఆస్తులున్న కుటుంబం. ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌లో చాలావరకు భూములను పేదలకు రాసిచ్చిన చరిత్ర మాది.

Updated : 11 Dec 2023 09:57 IST

తెదేపా నేతల వద్దే రూ. 15 కోట్లు అప్పు తీసుకున్నా
ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి

ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: ‘‘మాది తాతల కాలం నుంచే బాగా ఆస్తులున్న కుటుంబం. ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌లో చాలావరకు భూములను పేదలకు రాసిచ్చిన చరిత్ర మాది. నా దగ్గర పది రూపాయలుంటే, మరో రూ. 20 అప్పు చేసి మరీ పేదలకు ఇచ్చే గుణం నాది. అలాంటి నాపై ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయి. నేను మంత్రిగా ఉన్నప్పుడు పార్టీ ఫండ్‌ కోసం ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకున్నానే తప్ప... లంచం కాదు. ఎక్కడా అవినీతికి పాల్పడలేదు’’ అని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) వ్యాఖ్యానించారు. మంత్రిగా కొందరి వద్ద డబ్బులు తీసుకున్నానంటూ ఒంగోలులో శనివారం చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టిన బాలినేని.. ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. సీఎం జగన్‌ పట్ల విధేయతను ప్రకటించారు.

అయిదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన తాను తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులనూ అమ్మేయాల్సి వచ్చిందని... ప్రస్తుతం రూ. 15 కోట్ల అప్పులు ఉన్నాయని, అవి కూడా తెదేపా వారి నుంచే తీసుకున్నానని చెప్పారు. తెదేపా, జనసేన.. బురదజల్లే కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. తుపాను బాధితుల పరామర్శకు సీఎం జగన్‌ హెలికాప్టర్‌లో వచ్చారని పత్రికల్లో రాస్తున్నారని.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సైకిల్‌పై వచ్చి బాధితుల్ని పరామర్శించారా అని ప్రశ్నించారు. తుపాను నేపథ్యంలో సీఎం జగన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసి.. ముందుగా నిధులు ఇవ్వడంతోనే విపత్తును సమర్థంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన కోసం కార్యకర్తలు సక్రమంగా పనిచేయడం లేదన్న వ్యాఖ్యలు.. అధికారంలో ఉన్నామన్న నిర్లక్ష్యం విడనాడాలని చేసినవి మాత్రమేనని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బంది పడటం తనను బాధించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో 2019 ఎన్నికలకు మించిన మెజారిటీతో తాను గెలుస్తానని.. జగన్‌ మళ్లీ సీఎం అవుతారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని