కిసాన్‌ మోర్చా జాతీయ ఇన్‌ఛార్జిగా బండి సంజయ్‌

భారతీయ కిసాన్‌ మోర్చా ఇన్‌ఛార్జిగా కరీంనగర్‌ ఎంపీ, భాజపా ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ నియమితులయ్యారు.

Updated : 04 Jan 2024 04:11 IST

ఈనాడు, దిల్లీ: భారతీయ కిసాన్‌ మోర్చా ఇన్‌ఛార్జిగా కరీంనగర్‌ ఎంపీ, భాజపా ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు మొత్తం 7 పార్టీ అనుబంధ విభాగాలకు కొత్త ఇన్‌ఛార్జిలను నియమిస్తూ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్‌పాండాను నియమించారు. పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో యువ మోర్చా ఇన్‌ఛార్జిగా సునీల్‌ బన్సల్‌, ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జిగా తరుణ్‌చుగ్‌, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జిగా రాధా మోహన్‌ దాస్‌ అగర్వాల్‌, ఓబీసీ మోర్చా ఇన్‌ఛార్జిగా వినోద్‌ తావ్డే, మైనార్టీ మోర్చా ఇన్‌ఛార్జిగా దుశ్యంత్‌కుమార్‌ గౌతమ్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పించిన తర్వాత బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానం ఇప్పుడు కీలకమైన కిసాన్‌మోర్చా ఇన్‌ఛార్జిగా నియమించింది.


అయోధ్య రామయ్య దర్శనానికి ప్రజల ఎదురుచూపు

కార్ఖానా, న్యూస్‌టుడే: అయోధ్య రామయ్య దర్శనానికి దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. బోయిన్‌పల్లిలో అయోధ్య రామాలయ ద్వారాలు తయారు చేస్తున్న అనూరాధ టింబర్‌ డిపోను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా డిపో నిర్వాహకులు చదలవాడ తిరుపతిరావు, కిరణ్‌కుమార్‌ను సత్కరించారు. అనంతరం సంజయ్‌ మాట్లాడుతూ..రామాలయ నిర్మాణాన్ని అయోధ్యలోని ముస్లిం సంఘాలు స్వాగతించాయని, ఒవైసీ మాత్రం కోర్టు తీర్పును తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఫిర్యాదు చేసినా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. అహంకారంతోనే భారాస అధికారం కోల్పోయిందని, కాంగ్రెస్‌ నేతలు కూడా అలాగే వ్యవహరిస్తే వారికీ అదే గతి పడుతుందని తెలిపారు. కరీంనగర్‌లో గోమాతను వధించి నూతన సంవత్సర విందు చేసుకున్న నిందితులను ప్రజల సమక్షంలో బహిరంగంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని