సొమ్ము జనానిది.. బొమ్మ జగన్‌ది!

కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్‌ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్‌ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం.

Published : 09 May 2024 06:07 IST

పథకం, భవనం ఏదైనా ‘ముద్ర’ పడాల్సిందే
ప్రచారాలపై శ్రద్ధ.. పాలనలో మొద్దునిద్ర
వైకాపా పైత్యానికి రూ.5 వేల కోట్ల  ప్రజాధనం ఆవిరి
ఇళ్లు, స్థలాలు, శ్మశానాలనూ వదల్లేదు  
పాసుపుస్తకాలు, భూహక్కులు,  మరణ ధ్రువీకరణ పత్రాల జారీలోనూ..

కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్‌ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్‌ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం. వాటిపై తన ఫొటో, వైకాపా రంగుపడిందా? లేదా? అన్నదే ప్రధానం. ఉప్పు, పప్పు, నీరు, బియ్యం రాళ్లూరప్పలు, ఓపీ స్లిప్పులు.. బడిలోని నోటుబుక్కులు, విద్యార్థుల బెల్టులు శ్మశానాలు, భూహక్కులు, మరణ ధ్రువీకరణ పత్రాలపై తన బొమ్మ, పార్టీ రంగులు వేయించుకున్నారు.. రూ. కోట్ల నిధులను గంగలో కలిపారు జగన్‌!

‘‘ప్రజలకు ఏం చేశాం అన్నది ప్రధానం కాదు.. ప్రచారం ఎంత చేశాం అనేది ముఖ్యం..’’

ఇదీ.. జగన్‌ తన ఐదేళ్ల పాలనలో అనుసరించిన విధానం. పథకం ఏదైనా, కార్యక్రమం ఎలాంటిదైనా జగన్‌ బొమ్మ పడాల్సిందే. ఆస్పత్రా.. నీటి ట్యాంకా.. ప్రభుత్వ కార్యాలయమా.. అన్నది అనవసరం. వాటిపై వైకాపా రంగు పడాల్సిందే. ప్రజలను ఆకట్టుకోవడం కోసం ప్రచార యావతో.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారు. మరణ ధ్రువీకరణ పత్రాలపై, తాతముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూముల పట్టాదారు పాసుపుస్తకాలపై ఫొటోలను ముద్రించుకోవడానికీ వెనకాడలేదంటే జగన్‌ ప్రచార పిచ్చి అర్థం చేసుకోవచ్చు. ‘నా భూమిపై నీ పేరేంటి? నీ పెత్తనమెందుకు?’ అని అన్నదాతలు నిలదీసినా సమాధానాలు చెప్పలేదు జగన్‌. పొలాలు, ఇళ్లు, శ్మశానాల్లోని హద్దురాళ్లకూ ‘జగనన్న’ పేరు పెట్టేసి వికృతానందం పొందారు. అన్నింటికి తన బొమ్మ, పేరు ఉంటే ‘దిష్టి’ తగులుతుందనుకున్నారో ఏమో.. కొన్ని పథకాలకు ‘వై.ఎస్‌.ఆర్‌’ పేరు పెట్టారు. ఇలా మొత్తం.. 120కి పైగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై జగన్‌ బొమ్మలూ, ముద్రలే కనిపిస్తున్నాయి. అందుకు అయిన ప్రచార ఖర్చు.. రూ.5 వేల కోట్లు. ఇదంతా జనం సొమ్మే..

ప్రజల ప్రశ్నలకు బదులేదీ?

ప్రైవేటు వ్యక్తుల ఆస్తిపత్రాలపై జగన్‌ తన బొమ్మ ఎలా వేసుకుంటారని మేధావులు, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రజలు ఎండగడుతున్నారు. ‘భూమి నాది.. పుస్తకం నాది.. మధ్యలో ఈ జగన్‌ పైత్యం ఏంటీ..?’ అని కొందరంటున్నారు.

రంగుల ఖర్చు రూ.2,300 కోట్లు..

వైకాపా అధికారంలోకి రాగానే తొలుత టిడ్కో ఇళ్ల రంగులు మార్చింది. తర్వాత అన్న క్యాంటీన్లు, నీటి ట్యాంకులు, ఆస్పత్రులు, రైతు భరోసా కేంద్రాలు.. ఇలా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ రంగులు అద్దేసి రాక్షసానందం పొందింది. కొత్తగా నిర్మించే సచివాలయాలకు మూడు రంగులు వేయాలని 2019లో అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయం ఫలితంగా ఖజానాపై పడిన భారం రూ.1,300 కోట్ల పైమాటే. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు న్యాయస్థానాలను ఆశ్రయించాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ రంగులు వేసే ప్రక్రియకు స్వస్తి చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో మళ్లీ రూ.1,000 కోట్లకుపైగా ఖర్చు చేసి రంగులు వేశారు. ఇలా వైకాపా ప్రభుత్వం రంగులకే రూ.2,300 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వృథా చేసింది.

జేబుల్లోంచి డబ్బు ఇచ్చారా?

వ్యవసాయ, దాని అనుబంధ శాఖల పరిధిలో అమలవుతున్న 15కు పైగా కార్యక్రమాలకు ప్రభుత్వం ‘వై.ఎస్‌.ఆర్‌’, ‘జగన్‌’ పేర్లు పెట్టేసింది. ఆ శాఖకు సంబంధించిన యాప్‌లనూ వారిద్దరి పేర్లు వచ్చేలా రూపొందించారు. అందుకు రూ.కోట్లు ఖర్చుచేసినా ఆ యాప్‌లు ఉన్న విషయమే రైతులకు తెలియదు. ఏ పథకం అయినా సరే ముందు ‘జగనన్న’ పేరు తగిలించి తన జేబుల్లోంచి డబ్బు ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకొన్నారు. ఈ వైకాపా ప్రచారపిచ్చిలో కొందరు అధికారులూ భాగస్వాములయ్యారు. నవరత్నాల లోగో పేరుతో ఒక్కో సచివాలయానికి రూ.5 వేలు వెచ్చించారు. రేషన్‌ వాహనాలపైన కూడా జగన్‌ బొమ్మలు, మూడు రంగులు వేసి ప్రచారం చేసుకున్నారు. వీటికి రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని వ్యయం చేశారు.

శాశ్వత పత్రాలన్న స్పృహే లేదు..

ప్రజలకు దశాబ్దాలుగా పట్టాదారు పాసుపుస్తకాలు, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి. వాటిపై ముఖ్యమంత్రుల పేర్లు, ఫొటోలు ముద్రించిన దాఖలాలు లేవు. జగన్‌ పాలనలోనే అది సాధ్యమైంది!. సాధారణంగా ఏ పథకాలకు నేతల పేర్లు పెడితే అవి ఐదేళ్లకే పరిమితమవుతాయి. కానీ ధ్రువీకరణ పత్రాలు శాశ్వతంగా ఉంటాయి. ఆ స్పృహనే వైకాపా సర్కారుకు కరవైంది. ఫ్యామిలీ మెంబర్‌, 1బీ, అడంగల్‌, భూయాజమాన్య హక్కు పత్రం, శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు పలు ధ్రువీకరణ పత్రాలన్నింటినీ జగన్‌ బొమ్మలతోనే ముద్రించారు.

కోడిగుడ్లపైనా.. సిగ్గు సిగ్గు

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే కోడిగుడ్లపై కూడా జేజీఎం  (జగనన్న గోరుముద్ద) అంటూ ముద్రలు వేశారు. పిల్లలు తినే చిక్కీలూ, బడిగోడల నుంచి విద్యార్థులకు ఇచ్చే బెల్టులు, బ్యాగులు, పాలప్యాకెట్లు, బియ్యం సంచులు.. ఇలా ప్రతిదానిపైనా జగన్‌ పేరు, బొమ్మలే.

బాధ్యులపై చర్యలు ఉండవా?

వాస్తవానికి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, భవనాలకు ఏ పేరు పెట్టాలన్నా, రంగులు వేయాలన్నా ఎవరో ఒకరు ప్రతిపాదించాలి. అయితే వీటిని ప్రతిపాదించిన అధికారులు ఎవరు? వారిపై చర్యలు ఏంటీ? అన్నది ప్రశ్నార్థకమే. గ్రామ/వార్డు, మీసేవా కేంద్రాల ద్వారా ఇచ్చే ధ్రువీకరణ పత్రాలపైనా జగన్‌ ముద్రలేశారు. వీటికి ఒక్కో దానికి రూ.50 వరకు ఖర్చు పెట్టారు. తీరా ఎన్నికల సంఘం నిలిపేయమని ఆదేశించడంతో పక్కన పెట్టారు. దీనికి రూ.కోట్లలో నిధులు దుర్వినియోగం అయ్యాయి. వాటిని కొనుగోలు చేసి నష్టపోయామని మీసేవా కేంద్రాల నిర్వాహకులు వాపోతున్నారు.

ఈనాడు, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని