టీఎంసీ అంటే తూ..మై..ఔర్‌ కరప్షన్‌

కృష్ణానగర్‌ (పశ్చిమబెంగాల్‌), ఔరంగాబాద్‌ (బిహార్‌): తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అంటే తూ (నువ్వు), మై (నేను), ఔర్‌ కరప్షన్‌ (అవినీతి) అని ప్రధాని నరేంద్రమోదీ కొత్త అర్థం చెప్పారు.

Updated : 03 Mar 2024 03:41 IST

తృణమూల్‌పై వాగ్బాణాలతో విరుచుకుపడ్డ మోదీ
వారసత్వ నేతలు రాజ్యసభకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు
బిహార్‌ సభలో విమర్శలు

కృష్ణానగర్‌ (పశ్చిమబెంగాల్‌), ఔరంగాబాద్‌ (బిహార్‌): తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అంటే తూ (నువ్వు), మై (నేను), ఔర్‌ కరప్షన్‌ (అవినీతి) అని ప్రధాని నరేంద్రమోదీ కొత్త అర్థం చెప్పారు. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి, ఆశ్రిత పక్షపాతాల్లో కూరుకుపోయిందంటూ ఆ మేరకు పార్టీ సంక్షిప్త పేరులోని ఒక్కో అక్షరానికి దానిని ముడిపెట్టి ధ్వజమెత్తారు. శనివారం పశ్చిమబెంగాల్‌లో రూ.15,000 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నదియా జిల్లా కృష్ణానగర్‌లో జరిగిన ‘విజయ సంకల్ప సభ’లో ఆయన ప్రసంగించారు. బిహార్‌లోని ఔరంగాబాద్‌ జిల్లాలో రూ.21,000 కోట్ల పనులను ప్రారంభించి, అక్కడ జరిగిన బహిరంగ సభలోనూ మాట్లాడారు. బెంగాల్‌ సభలో దీదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘‘..ఈ సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన ప్రజల అభిమానాన్ని చూస్తుంటే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 పైగా స్థానాలు గెలుచుకుంటుందనే ఆత్మవిశ్వాసం మరింత బలపడుతోంది. బెంగాల్‌ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు నిరాశకు గురవుతున్నారు. అణచివేత, వంశపారంపర్య రాజకీయాలు, వంచనలకు టీఎంసీ పర్యాయ పదం. బెంగాల్‌ ప్రతిష్ఠకు టీఎంసీ కళంకం తెచ్చింది. కేంద్ర పథకాల ఫలాలు పేదలకు అందకుండా అడ్డుకుంటోంది. వాటిపై స్టిక్కర్‌ అతికించి తమ సొంత పథకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రతి స్కీంను స్కాంగా మార్చే నైపుణ్యాన్ని సాధించింది. పేదలకు దక్కాల్సినవాటిని లాక్కునిపోయి వారికి మొండిచెయ్యి చూపించడానికి ఎంతమాత్రం వారు వెనకాడడం లేదు. గూండాలు, మాఫియా నేతలు రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వారికి ఎవరి అనుమతి అవసరం లేదు. పర్యావరణ అనుమతుల రూపంలో ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తోంది’’ అని విమర్శించారు.

42 స్థానాల్లోనూ కమలం వికసించాలి

‘‘సందేశ్‌ఖాలీలో వేధింపులకు గురైన తల్లులు, సోదరీమణులు న్యాయం కోసం పోరాడుతుండగా.. వారికి అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిందితుల పక్షాన నిలబడింది. బెంగాల్‌ మహిళలు దుర్గమ్మలా తమ శక్తిని చాటుకోవడం, భాజపా కార్యకర్తలు వారికి అండగా నిలవడంతో రాష్ట్ర సర్కారు చివరకు తలవంచక తప్పలేదు. రాష్ట్రంలో ఎప్పుడు అరెస్టులు జరగాలనేది పోలీసులు కాకుండా నేరగాళ్లే నిర్ణయించుకునేంతగా పరిస్థితి మారింది. ప్రజలు ఎన్నో ఆశలతో తృణమూల్‌కు భారీ విజయాలను కట్టబెట్టినా ఆ పార్టీ మాత్రం అభివృద్ధి పనుల్ని వదిలేసి అవినీతి ఊబిలో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లోనూ కమలం వికసించేలా చూడాలి’’ అని మోదీ చెప్పారు.


భాజపా అభ్యర్థులకు శుభాకాంక్షలు: ప్రధాని

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు తొలి విడతలో ఎంపికైన అభ్యర్థులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వారు ఎన్నికల్లో విజయం సాధిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ‘నిరుపేదలకు మనం అందించిన ఫలాలు, సుపరిపాలన ట్రాక్‌ రికార్డును చూపించి ప్రజల్లోకి వెళ్తున్నాం’ అని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. ‘అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. మీకు శుభం కలుగుగాక. 140 కోట్ల మంది ప్రజలు మళ్లీ మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. అది మనకు మరింత బలాన్ని ఇవ్వనుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.


లోక్‌సభకు పోటీ చేయాలంటే వాళ్లు భయపడుతున్నారు

వంశపారంపర్య రాజకీయాలు చేసేవారు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి రాజ్యసభ మార్గాన్ని ఎంచుకుంటున్నారని మోదీ విమర్శించారు. వంశపారంపర్య పాలన కొనసాగిస్తూ ప్రజల మదిలో భయాందోళన కలిగించిన కూటమి నేతల్ని ఎన్డీయే తరిమికొట్టిందని బిహార్‌ సభలో చెప్పారు. బిహార్‌ను వెనుకబడనీయకుండా అభివృద్ధి చేయడానికి, మహిళలు నిర్భీతిగా జీవించడానికి తాను హామీగా ఉంటానని తెలిపారు. ఇప్పుడు బిహార్‌లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారు పనిచేస్తోందని చెప్పారు.  బేగుసరాయ్‌ జిల్లాలో రూ.30,000 కోట్ల పనుల్ని ప్రారంభిస్తూ.. ఆర్జేడీ-కాంగ్రెస్‌ పాలనపై విమర్శలు గుప్పించారు.  తాను ఎప్పటికీ ఎన్డీయే కూటమిలోనే ఉంటానని ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ చెప్పినప్పుడు ప్రధాని పెద్దపెట్టున నవ్వులు చిందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని