గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడండి

అభ్యర్థుల ఎంపికలో భాగంగా 81 అసెంబ్లీ, 18 లోక్‌సభ నియోజకవర్గాలో మార్పుచేర్పులు చేసినందున.. వాటిలో కొత్త అభ్యర్థులకు స్థానికంగా గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడాలని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.

Updated : 19 Mar 2024 07:17 IST

‘మేమంతా సిద్ధం’ పేరుతో 27 నుంచి బస్సు యాత్ర
వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీలో ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు, అమరావతి: అభ్యర్థుల ఎంపికలో భాగంగా 81 అసెంబ్లీ, 18 లోక్‌సభ నియోజకవర్గాలో మార్పుచేర్పులు చేసినందున.. వాటిలో కొత్త అభ్యర్థులకు స్థానికంగా గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడాలని వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. వర్గపోరు లేకుండా ఎక్కడికక్కడ సర్దుబాటు చేయాలన్నారు. సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. పోలింగ్‌కు చాలా సమయం ఉన్నందున ప్రతి అభ్యర్థీ వారి పరిధిలో అన్ని సచివాలయాలనూ సందర్శించేలా చూడాలని సూచించారు. ప్రాంతీయ సమన్వయకర్తలు వారికి అప్పగించిన ప్రాంతాల్లోనే ఉంటూ ఎన్నికల వ్యవహారాలు, ప్రచార సరళిని చూసుకోవాలన్నారు. ఈ నెల 27 నుంచి తాను బస్సు యాత్ర చేపడుతున్నానని జగన్‌ చెప్పారు. గతంలో నిర్వహించిన సిద్ధం సభల్లాగే తన బస్సు యాత్రనూ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామన్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోనూ చేపట్టబోయే ఈ యాత్రలో భాగంగా మేధావులు, తటస్థులను కలుస్తానని, బహిరంగ సభలూ ఉంటాయని వివరించారు. ఈ సభలకు జనసమీకరణ, వారందరికీ రవాణా సదుపాయం కల్పించడం వంటివన్నీ ప్రాంతీయ సమన్వయకర్తలే పర్యవేక్షించాలన్నారు.

21 రోజుల పాటు 21 లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటన

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో సీఎం జగన్‌ ఇక జనం వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరుతో 21 రోజుల పాటు 21 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఆయన బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం.. కడప లోక్‌సభ పరిధిలోని ఇడుపులపాయ నుంచి మొదలు కానుంది. సిద్ధం సభలు జరిగిన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలను మినహాయించి మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల్లో ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేయనున్నట్లు సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం సోమవారం వైకాపా కార్యాలయంలో ప్రకటించారు. .

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని