ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా నాపై వైకాపా దుష్ప్రచారం

వీడియోల్లో తాను మాట్లాడని అంశాలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎడిటింగ్‌ ద్వారా మార్పులు చేసి వైకాపా దుష్ప్రచారానికి దిగిందని.. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్‌ కుల, మత రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 19 Mar 2024 06:57 IST

ఓటమి భయంతోనే జగన్‌ కుల, మత రాజకీయాలు చేస్తున్నారు
ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీపడం
త్వరలో వారి అభివృద్ధికి ప్రత్యేక డిక్లరేషన్‌ ప్రకటిస్తాం
ముస్లిం సంఘాల భేటీలో చంద్రబాబు
ఈనాడు - అమరావతి

వీడియోల్లో తాను మాట్లాడని అంశాలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎడిటింగ్‌ ద్వారా మార్పులు చేసి వైకాపా దుష్ప్రచారానికి దిగిందని.. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్‌ కుల, మత రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. త్వరలో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి త్వరలో ప్రత్యేక డిక్లరేషన్‌ ప్రకటిస్తామని, వారికి పూర్తిగా అండగా నిలుస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే భాజపాతో కలిశామని, ముస్లింలు దూరదృష్టితో ఆలోచించి బాసటగా నిలవాలని కోరారు.  గతంలో భాజపాతో తెదేపా కలిసిన సందర్భంలోనూ ముస్లింల ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ అంశాల్లో పూర్తిగా వెన్నుదన్నుగా నిలిచామని గుర్తుచేశారు. మతపరమైన అంశాల్లోనూ ఎక్కడా జోక్యం చేసుకోలేదని.. ఇప్పుడు కూడా ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో ఆయన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్‌ షిబ్లీ, ఇతర ముస్లిం సంఘాల నేతలతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల వేదికగా తెదేపాపై వైకాపా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు.

కోడికత్తి డ్రామా నుంచి బాబాయ్‌ హత్య వరకూ అన్ని అస్త్రాలూ ఉపయోగించిన జగన్‌ ఇప్పుడు కులాలు, మతాలపై పడ్డారని చంద్రబాబు మండిపడ్డారు. ‘జనసేనతో తెదేపా పొత్తు కుదుర్చుకున్న సమయంలో జగన్‌ కుల రాజకీయం చేసి బోల్తాపడ్డారు. భాజపాతో మేం పొత్తు ప్రకటించగానే మతపరమైన రాజకీయానికి తెరతీశారు. దీన్ని ముస్లిం సంఘాల నేతలు ఎండగట్టాలి. ముస్లింలపై జగన్‌కు ఉన్నది కపట ప్రేమే’ అని ధ్వజమెత్తారు. ‘జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రంజాన్‌ తోఫాను ఎందుకు ఆపేశారు? దుల్హన్‌, దుకాణ్‌-మకాన్‌ సహా పది సంక్షేమ పథకాలు ఎందుకు రద్దు చేశారు? కడపలో తెదేపా హయాంలో 90 శాతం కట్టిన హజ్‌హౌస్‌ను ఎందుకు పూర్తి చేయలేదు’ అని నిలదీశారు. జగన్‌కు అసలు ముస్లింల గురించి మాట్లాడే అర్హతే లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని