ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ పదవికి సవాంగ్‌ రాజీనామా చేయాలి

గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌సవాంగ్‌ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 19 Mar 2024 04:55 IST

 మూడుసార్లు మూల్యాంకనం చేయించి ఒక్కసారేనని బుకాయింపు సిగ్గుచేటు
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

ఈనాడు, అమరావతి: గ్రూప్‌-1 మెయిన్స్‌ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌సవాంగ్‌ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ డిమాండ్‌ చేశారు. డీజీపీగా బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన ఆయన నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. గ్రూప్‌-1 ఉద్యోగాల్లో రూ.150-200 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆయన సోమవారం మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘తొలుత డిజిటల్‌ మూల్యాంకనం జరిగాక కార్యదర్శిగా ఉన్న పి.సీతారామాంజనేయులు మళ్లీ మాన్యువల్‌గా మూల్యాంకనం చేయించారు. ఇందుకు కంట్రోల్‌ బిండిల్‌ స్లిప్స్‌ సరఫరా చేయాలని డేటాటెక్‌ మెథడెక్స్‌కు లేఖ రాయడం వాస్తవం కాదా? జవాబు పత్రాలు స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించేందుకు భద్రత కావాలని గుంటూరు ఎస్పీకి లేఖ రాయడం నిజం కాదా? తర్వాత స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద కర్నూలునుంచి వచ్చిన 32 మంది కానిస్టేబుళ్లకు విధులు ఎందుకు కేటాయించారు? మాన్యువల్‌ విధానంలో మూల్యాంకనం జరగకపోతే సీతారామాంజనేయులు ఈ లేఖలు ఎందుకు రాశారు? హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనానికి వచ్చిన అధికారులకు గదులు, భోజనాలకు రూ.20 లక్షలు చెల్లించడం వాస్తవం కాదా? వాటిని బయటపెడతారా? మూల్యాంకనం పూర్తి చేశామని, పోస్టు మూల్యాంకనం కోసం రావాలంటూ డేటాటెక్‌ మెథడాలజీకి రామాంజనేయులు మరో లేఖ ఎందుకు రాశారు? ఇవన్నీ నిజం కాదని చెప్పే ధైర్యం సవాంగ్‌కు ఉందా?’ అని పట్టాభిరామ్‌ నిలదీశారు.

గవర్నర్‌ ఆశ్చర్యపోయారు

‘ఈ స్కామ్‌పై మా వద్ద ఉన్న ఆధారాలు చూపిస్తే గవర్నర్‌ ఆశ్చర్యపోయారు. నా వద్ద ఉన్న ఆధారాలతో మీడియా సమక్షంలో చర్చకు వస్తా. సవాంగ్‌ ఈ చర్చకు సిద్ధమా? కోర్టు తీర్పు వెలువడగానే నైతిక బాధ్యత వహించి సవాంగ్‌ రాజీనామా చేయాల్సింది. గవర్నర్‌ తొలగించేలోపు రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉంటుంది. ఇలాంటి ఛైర్మన్‌తో ప్రస్తుతం ఏపీపీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తారని ఎలా నమ్మాలి? వీటి మూల్యాంకనంలోనూ అవకతవకలు జరగబోవని గ్యారెంటీ ఏమిటి? తెదేపా అధికారంలోకి రాగానే ఈ స్కామ్‌పై సీబీఐతో విచారణ చేయిస్తాం. ఎవరిని వదిలిపెట్టబోం’ అని పట్టాభిరామ్‌ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని