ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?

‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు.

Published : 19 Mar 2024 05:09 IST

పేర్లు లేని పాస్‌లపై అధికారులు సంతకాలు చేసి ఇస్తారా?
తక్షణమే విచారణ జరపాలి
జనసేన నేత నాదెండ్ల మనోహర్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: ‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. సభ జరుగుతున్న సమయంలోనే అనేక భద్రతా వైఫల్యాలు కనిపించాయి. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై సమగ్ర విచారణ జరపాలి’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రధాని సభ కోసం జారీ చేసిన కీలక పాస్‌లు ఎవరి పేరుతో జారీ చేశారన్న వివరాలు కూడా లేవు. ప్రధాని సభలో ఏ పేరు లేని పాస్‌లపై అధికారులు సంతకాలు చేసి ఇచ్చేశారంటే భద్రతా వ్యవహారాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పోలీసుశాఖ, కలెక్టర్‌ కార్యాలయ అధికార యంత్రాంగం తప్పిదం ఇందులో కనిపిస్తోంది’ అని విమర్శించారు.

2020లోనే పవన్‌ కూటమి యత్నాలు

‘అమరావతి రైతులు 2020 జనవరిలో పవన్‌కల్యాణ్‌ను కలిసి వైకాపా ప్రభుత్వ దాష్టీకాలు, వారి కష్టాలు తెలియజేశారు. వాటిపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు దిల్లీ వెళ్లినప్పుడే.. విపక్షాల ఓటు చీలకూడదని కూటమి ఏర్పాటుపై కేంద్ర పెద్దలతో పవన్‌ మాట్లాడారు. వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపగలమనే రాజకీయ వ్యూహంతోనే ఆయన ముందడుగు వేశారు. నాలుగేళ్ల పాటు  ఆయన చేసిన కృషి వల్లే ఈ పొత్తు ఏర్పడింది. ఈ కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించబోతోంది’ అని మనోహర్‌ పేర్కొన్నారు. ‘ప్రజాగళం సభలో ప్రధానమంత్రి చెప్పినట్లుగా కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటం వల్లనే ఏపీలో ప్రగతి పరుగులు తీస్తుంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతోనే ఏపీలో అభివృద్ధి సాధ్యం. రాష్ట్రంలో వైకాపాకు ఇంటికెళ్లే సమయం దగ్గరకు   వచ్చింది’ అని అన్నారు. సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రరెడ్డి, పీఏసీ సభ్యుడు పంతం నానాజీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని