సంక్షిప్త వార్తలు (13)

విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల్లో ఉచిత విద్య అందిస్తానని 25వేల మంది పేదపిల్లలు, వారి తల్లిదండ్రులను మభ్యపెట్టి సీఎం జగన్‌ మోసం చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ విమర్శించారు.

Updated : 16 Apr 2024 06:23 IST

25వేల మంది పేద తల్లిదండ్రులను మోసం చేసిన జగన్‌

తెదేపా అధికార ప్రతినిధి ఎన్‌.విజయ్‌కుమార్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు, కార్పొరేట్‌ బడుల్లో ఉచిత విద్య అందిస్తానని 25వేల మంది పేదపిల్లలు, వారి తల్లిదండ్రులను మభ్యపెట్టి సీఎం జగన్‌ మోసం చేశారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ విమర్శించారు. ప్రైవేటు బడులకు ప్రభుత్వం కట్టాల్సిన ఫీజులను అమ్మఒడి నుంచి కట్టుకోమని చెప్పి, ఫీజులకు ఎగనామం పెట్టారని వెల్లడించారు. రెండేళ్ల ఫీజును ఒకేసారి కట్టలేక ఆ పేద కుటుంబాలు అప్పులపాలవుతున్నాయన్నారు. ‘అమ్మఒడి’ పిల్లలను బడికి పంపడానికి తల్లులకు ఇచ్చే ప్రోత్సాహకమే గానీ అందులో నుంచి ఫీజు కట్టమని ఎక్కడా లేదన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.


లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ మూడో జాబితా విడుదల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మూడో జాబితాను లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. ఇప్పటికే 28 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీచేసే వారిని ప్రకటించగా.. తాజాగా మరో ఆరుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ సోమవారం వెల్లడించారు.


ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ గురించి ఆలోచన చేయాలి: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఏపీలో రాళ్లతో కొట్టారని సీఎం జగన్‌, తెదేపా అధినేత చంద్రబాబు మధ్య పంచాయితీ నడుస్తోందని, ఇలా కొట్టుకుంటే ఏమి వస్తుందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ గురించి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి అప్పులు చేసే ప్రధాని వద్దని.. సుపరిపాలన అందించే కాంగ్రెస్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.


సీపీఎం నేతల నిర్బంధం కోడ్‌ ఉల్లంఘనే

ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ గుడివాడ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీపీఎం నాయకులు ఆర్‌సీసీరెడ్డి, బీవీ శ్రీనివాసరావు, బసవ అరుణలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఖండించారు. వైకాపా ఎన్నికల ప్రచారంలో మరొక రాజకీయ పార్టీ నాయకులను అరెస్టు చేయడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. ఉదయం 6 గంటలకే బయటకు వెళ్లడానికి వీలు లేదంటూ పార్టీ నేతల ఇంటి ముందు పోలీసులు కాపలాగా ఉన్నారని, దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.  


రాజకీయ లబ్ధికోసమే ‘గులకరాయి’ నాటకం

తెదేపా నాయకుడు డూండి రాకేశ్‌ ఆరోపణ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: గత ఎన్నికల సమయంలో చేసిన కోడికత్తి కుట్రలాగే.. ఇప్పుడు గులకరాయి డ్రామాకు సీఎం జగన్‌ తెరలేపారని తెదేపా వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేశ్‌ అరోపించారు. మరో అమాయకుడిని జైల్లో పెట్టి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైకాపా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. రాయి దాడి జరిగిన రోజు జగన్‌ పర్యటన రూట్‌ మ్యాప్‌ ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘వైకాపా నేతలు ఎన్ని కుయుక్తులు పన్నినా వారికి ఓటమి ఖాయం. జగన్‌ను నమ్మడానికి జనం సిద్ధంగా లేరు.  కుట్రలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటే ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారు’ అని రాకేశ్‌ పేర్కొన్నారు.


ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ‘ఎన్‌రీచ్‌ ఏపీ’ సమావేశం నేడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ‘ఎన్‌రీచ్‌ ఏపీ’ సమావేశం మంగళగిరిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెదేపా అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హజరుకానున్నారు. ఇందులో పోల్‌ మేనేజ్‌మెంట్‌, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెదేపా తెలిపింది.


గిరిజనుల సంక్షేమానికి వైకాపా సర్కారు తూట్లు

ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ధారూ నాయక్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన 16 గిరిజన సంక్షేమ పథకాలను రద్దు చేసి, వారికి అందాల్సిన నిధులను వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఎస్టీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ధారూ నాయక్‌ ధ్వజమెత్తారు. 2019 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి 87శాతం గిరిజనుల ఓట్లను పొందారని.. అధికారంలోకి వచ్చాక వారిపై అక్రమ కేసులు పెట్టి హత్యలు చేయించారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘గిరిజనుల ఉపాధిని దెబ్బతీశారు. అయిదేళ్లలో గిరిజనులపై అనేక దాడులు జరిగినా ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర కనీసం మాట్లాడలేదు. అటవీ హక్కుల పాస్‌ పుస్తకాలను వైకాపా అనుచరులకు కేటాయించి గిరిజనులకు తీరని అన్యాయం చేశారు. గురుకులాల్లో చదువుతోన్న పిల్లల అవస్థలు వర్ణనాతీతం. చదువుకోవాలంటే మైళ్ల దూరం నడవాల్సిన పరిస్థితి. గిరిజనులకు అందాల్సిన రూ.5వేల కోట్లు పక్కదారి పట్టించిన వైకాపా నాయకులకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హతే లేదు’ అని ధారూ నాయక్‌ పేర్కొన్నారు.


మైనారిటీల్లో పేదరికానికి వైకాపానే కారణం

భాజపా నేత పేరాల చంద్రశేఖర్‌

ఈనాడు-అమరావతి: ముస్లింలు, క్రిస్టియన్లకు భాజపా వ్యతిరేకమని వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల సమన్వయకర్త పేరాల చంద్రశేఖర్‌ మండిపడ్డారు. విజయవాడలో సోమవారం ఆయన మాట్లాడారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో 60 మంది క్రిస్టియన్‌ ఎమ్మెల్యేలు భాజపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. అస్సాంలో 35% ముస్లింలున్నా.. భాజపా భారీ మెజార్టీతో విజయం సాధించింది. రాష్ట్రంలో క్రిస్టియన్లు, ముస్లింలు పేదరికంలో మగ్గిపోవడానికి వైకాపా ప్రభుత్వ పాలనా వైఫల్యమే కారణం. వైకాపా పెద్దఎత్తున దొంగ ఓట్లు సృష్టించింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలి. భాజపా జాతీయ నాయకత్వం ప్రకటించిన మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్‌కు కూడా లాభదాయకంగా ఉంటుంది. పేదల సొంతింటి కల భాజపాతోనే సాధ్యం’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ పాల్గొన్నారు.


చిన్నరాష్ట్రాలే భారత్‌కు ఆత్మ

జాతుల ఘర్షణబారిన పడ్డ మణిపుర్‌లో శాంతి నెలకొల్పడమే కేంద్రం ధ్యేయం. మణిపుర్‌ను ముక్కలు చేయాలనుకుంటున్నవారికి, ఐక్యంగా ఉంచాలనుకుంటున్నవారికి మధ్య పోరు ఇది. ఉత్తర, దక్షిణ దేశాలుగా భారత్‌ విభజన జరగాలని కాంగ్రెస్‌ కోరుకుంటోంది. చిన్నరాష్ట్రాలతో ఏం ఉపయోగమని కాంగ్రెస్‌ అంటుంది. చిన్నరాష్ట్రాలే భారత్‌కు ఆత్మ.

 మణిపుర్‌, త్రిపుర ఎన్నికల సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా


రామరాజ్యం మొదలైంది

దేశంలో రామరాజ్యం వేళ్లూనుకోవడం మొదలైంది. అది కార్యరూపం దాల్చకుండా ఇప్పుడెవరూ ఆపలేరు. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ భాజపా నెరవేర్చింది. ఉమ్మడి పౌర స్మృతిని రాబోయే ఐదేళ్లలో ఎందుకు అమలు చేయకూడదు? మేం రాజకీయాలు చేస్తున్నది దేశం కోసం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, చేయకపోయినా మహిళల గౌరవంపై దాడుల్ని మాత్రం సహించేదిలేదు. అందుకే ముమ్మారు తలాక్‌ను రద్దుచేశాం.

 కథువా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌


శుష్క వాగ్దానాలతో గెలవలేరు

శుష్క వాగ్దానాలు, నాటకాలతో భాజపా, కాంగ్రెస్‌ గెలవలేవు. మంచిరోజులు వస్తాయంటూ ఇచ్చిన హామీల్లో నాలుగోవంతైనా పనిచేయలేదని అన్నివర్గాలూ గ్రహించాయి. మతం పేరుతో ప్రజలు అణచివేతకు గురవుతున్నారు. పెట్టుబడిదారులతో భాజపాకు ఉన్న సంబంధమేమిటో ఎన్నికల బాండ్లతో బయటపడిపోయింది. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే భాజపా అధికారంలోకి రాదు.

 యూపీలో ఎన్నికల ప్రచారంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి


సెల్ఫీ తీసుకున్నా పన్ను వేస్తారేమో!

వస్తు-సేవల పన్ను (జీఎస్‌టీ)తో పేదల్ని దోచుకుంటున్నారు. ఇకపై స్వీయచిత్రం (సెల్ఫీ) తీసుకున్నా పన్ను బాదేస్తారేమో! హోటల్లో తినే ఆహారం నుంచి ద్విచక్ర వాహన మరమ్మతుల వరకు అన్నింటికీ పన్ను తప్పట్లేదు. రూ.1.45 లక్షల కోట్ల కార్పొరేట్‌ పన్నును రద్దుచేసిన భాజపా.. సామాన్యులపై సానుభూతి చూపించలేదా? 64% జీఎస్టీ మొత్తం సామాన్యుల నుంచే వస్తోంది.

 ‘ఎక్స్‌’లో తమిళనాడు సీఎం ఎంకె.స్టాలిన్‌


4 లోక్‌సభ స్థానాల్లో ఆప్‌ 200 సంకల్ప్‌ సభలు

దిల్లీ: తమ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజల మద్దతు కూడగట్టేలా లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ స్థానాల పరిధిలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200 సంకల్ప్‌ సభలు నిర్వహించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. వీటిలో ఆప్‌ సీనియర్‌ నేతలు, మంత్రులు పాల్గొంటారు.


దలైలామాను కలిసిన కంగన

ధర్మశాల: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాను హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ లోక్‌సభ భాజపా అభ్యర్థి, సినీ నటి కంగనా రనౌత్‌ సోమవారం ధర్మశాలలో కలిశారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత జైరాం ఠాకుర్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దలైలామాను కలవడం మంచి అనుభవమని, దీన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని కంగనా పేర్కొన్నారు. అనంతరం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార గీతం విడుదల

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచార గీతాన్ని కాంగ్రెస్‌ పార్టీ సోమవారం విడుదల చేసింది. మహిళలు, యువత, రైతులు, కార్మికులకు ‘న్యాయం’ ఇతివృత్తంతో ఈ గీతం కొనసాగనుంది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేష్‌, ప్రతినిధి సుప్రీయ శ్రీనతేలు ఇక్కడి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ గీతాన్ని విడుదల చేశారు.


యూపీలో 80తో ఎన్డీయేకు 400

ఉత్తరప్రదేశ్‌లో 80కి 80 లోక్‌సభ స్థానాల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే గెలుస్తుంది. దేశంలో 400 పైగా సీట్లను గెలవాలన్న లక్ష్యానికి అది ప్రాతిపదిక అవుతుంది. (అస్సీ బనేగా ఆధార్‌.. ఎన్డీయే చార్‌ సౌ పార్‌.. ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌.) నూతన, మహత్తర, స్వయంసమృద్ధ, వికసిత భారత్‌ ఆవిర్భావానికి భాజపా సంకల్ప పత్రం దోహదపడుతుంది. బిహార్‌లో గూండా రాజ్యానికి, వంశపారంపర్య పాలనకు ముగింపు పలకాలంటే ఎన్డీయేకు ఓటు వేయాలి.

లఖ్‌నవూలో విలేకరులతో, బిహార్‌లో  ఎన్నికల సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌


‘కొత్త రాజ్యాంగం’ వ్యాఖ్యల్ని ఆపడంలో మోదీ విఫలం

భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే కొత్త రాజ్యాంగాన్ని తీసుకువస్తుందని ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని ఆపడంలో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారు. ఈసారి విజయం సాధించలేమనే భయంతో ఆయన ఉన్నారు. ఆయన నైజమేమిటో దేశం చూసింది. రాజ్యాంగం జోలికి వెళ్లినవారి కనుగుడ్లను ప్రజలు పెకలిస్తారు.

పట్నాలో ఒక ప్రకటనలో లాలూప్రసాద్‌ యాదవ్‌, ఆర్జేడీ అధ్యక్షుడు


దేశ వ్యతిరేక శక్తులకు తృణమూల్‌ ఆశ్రయం

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ).. దేశ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పిస్తోంది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి అండగా నిలుస్తోంది. దేశంలో, బెంగాల్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినవారికి పశ్చిమ బెంగాల్‌లోనే ఎందుకు ఆశ్రయం దొరుకుతోందో?

 శిలిగుడిలో విలేకరులతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌


ఈశాన్యంలో కాంగ్రెస్‌ అనుకూల పవనాలు

ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్నాయి. 370 అధికరణాన్ని రద్దు చేసినట్లే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన 371 అధికరణం విషయంలోనూ భాజపా చేస్తుందనే భయం అక్కడి ప్రజల్లో ఉంది. మతం, భాష, ఆహారం తదితరాల పరంగా ఉన్న వైవిధ్యాన్ని కాపాడాలని ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.

 దిల్లీలో విలేకరులతో జైరాం రమేశ్‌, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని