కాంగ్రెస్‌ హామీలు అమలయ్యే వరకూ పోరాటం

కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు భాజపా పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు.

Published : 16 Apr 2024 02:55 IST

ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీయాలి
మిస్డ్‌కాల్‌తో అన్నదాతలు సమస్యలు తెలియజేయాలి
రైతు దీక్షలో కిషన్‌రెడ్డి పిలుపు

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకు భాజపా పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే.. కొత్త హామీలతో ఓట్లు అడిగేందుకు వస్తున్న కాంగ్రెస్‌ నేతలను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గత భారాస ప్రభుత్వం అనేక రకాలుగా రైతులకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్‌ కూడా రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేసే పరిస్థితిలో లేదన్నారు. సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో రైతుల సమస్యలపై కిషన్‌రెడ్డి రైతు దీక్ష నిర్వహించారు. ‘కాంగ్రెస్‌ గ్యారంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు’ పేరుతో నిర్వహించిన దీక్షలో రైతులతో పాటు భాజపా ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్‌ సీఎంగా ఉన్న కాలంలో రైతుల సంక్షేమంపై మాటలు కోటలు దాటేవని, పనులు మాత్రం ఫాంహౌస్‌ దాటేవి కాదని ఎద్దేవా చేశారు. పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి చేయకపోవడంతోపాటు రైతు వ్యతిరేక విధానాలతో అన్నదాతలను ఇబ్బందులకు గురిచేశారని, అందుకే గత ఎన్నికల్లో భారాస ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి గ్యారంటీల అమలు కార్యాచరణ ప్రకటించాలి

రైతుల కష్టాలు తీరుస్తామంటూ పలు హామీలతో కాంగ్రెస్‌ నేతలు కర్షకులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని కిషన్‌రెడ్డి ఆక్షేపించారు. వంద రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పాలకులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక ఉందో సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్‌ బోగస్‌ అని విమర్శించారు. రూ.2 లక్షలలోపు రుణాల మాఫీ, ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేలు, వరికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ సహా పలు హామీల అమలులో కాంగ్రెస్‌ సర్కారు విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ.2,200 ఇస్తోందని, రూ.500 బోనస్‌తో కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎరువుల కొరత తీర్చడం, మద్దతు ధర పెంపు, దేశంలో కరెంటు కోతలు లేకుండా చేయడం సహా రైతు సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. 9904119119కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని రైతులు తమ సమస్యలను భాజపా రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. విత్తనాలు, ఎరువుల కొరత, రుణాలు చెల్లించాలంటూ బ్యాంకులు చేసే ఒత్తిడి సహా ఏ సమస్య ఉన్నా తెలియజేయాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని