Punjab polls: ‘మా నాన్నని ఎవరూ ఆపలేరు’.. సిద్ధూ కుమార్తె ఆసక్తికర వ్యాఖ్యలు

సీఎం అభ్యర్థిగా సిద్ధూని ఎన్నుకోకపోవడంపై ఆయన కుమార్తె రబియా కౌర్‌ తాజాగా స్పందించారు. ఆయన్ను ఎక్కువకాలం ఎవరూ ఆపలేరని......

Published : 12 Feb 2022 02:06 IST

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ.. చన్నీ వైపే అధిష్ఠానం మొగ్గుచూపిన విషయం తెలిసిందే. పోటీలో ఉన్న ఇద్దరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూని పక్కనపెడుతూ.. ప్రస్తుత సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీనే అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటించింది. అయితే అధిష్ఠానం నిర్ణయంపై సిద్ధూ సహా ఆయన కుటుంబసభ్యులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం అభ్యర్థిగా సిద్ధూని ఎన్నుకోకపోవడంపై ఆయన కుమార్తె రబియా కౌర్‌ తాజాగా స్పందించారు. ఆయన్ను ఎక్కువకాలం ఎవరూ ఆపలేరని.. తన తండ్రిని ఓ అవినీతిపరుడితో పోల్చి చూడొద్దని వ్యాఖ్యానించారు.

జాతీయ మీడియాతో రబియా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఏ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుందో నాకు తెలియదు. దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. కానీ నిజాయతీ గల ఓ వ్యక్తిని ఎవరూ ఎక్కువకాలం ఆపలేరు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చన్నీ పేరు ప్రస్తావించకుండా.. ఆయనో అవినీతిపరుడిని ఆరోపించారు. ఓ నిజాయతీ గల వ్యక్తితో పోల్చిచూడొద్దు అని అన్నారు. ‘సీఎం అభ్యర్థిగా ఆయన (సిద్ధూ) ఉన్నా, లేకపోయినా ఏం పర్వాలేదు. ఆయన ఇమెజ్‌పై ఎలాంటి మరకలు లేవు. రానున్న రోజుల్లో గర్వపడే పనులు చేస్తారు’ అని పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిగా చన్నీ ఎంపిక.. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కమ్ములాటలకు దారితీశాయని వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు ఎలాంటి ఫలితాలనిస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని