Maharashtra Politics: ‘మహా’ రాజకీయాల్లో ట్విస్టులే ట్విస్టులు

మహారాష్ట్ర రాజకీయాల్లో కేవలం రెండేళ్లలో రెండు భారీ కుదుపులు ఏర్పడ్డాయి. ఒకటి శివసేన రెండుగా చీలిపోగా.. తాజాగా ఎన్సీపీకి చెందిన అజిత్‌పవార్‌ వర్గం అధికార పక్షానికి మద్దతు తెలిపింది.

Updated : 02 Jul 2023 17:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) చదరంగాన్ని తలపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేనంతగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందో, ఎప్పుడు కుప్పకూలిపోతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏడాది క్రితం శివసేన పార్టీ (Shiv Sena) రెండుగా చీలిపోయి మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలిపోగా.. తాజాగా ప్రతిపక్ష ఎన్సీపీ (NCP) కూడా అదే బాటలో పయనిస్తోంది. అసెంబ్లీలో ఆ పార్టీకి మొత్తం 53 స్థానాలు ఉండగా.. అందులో 30 మంది ఎమ్మెల్యేలు అజిత్‌పవార్‌తో కలిసి అధికారకూటమికి మద్దతు పలికారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే.. గతంలో శివసేన విషయంలో ఏం జరిగిందో.. ఇప్పుడు కూడా అదే తరహా పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. అధికారకూటమిలో చేరిన ఎన్సీపీ ఎమ్మెల్యేలపై ఆ పార్టీ అనర్హత వేటు వేసే అవకాశముంది. లేదంటే.. గతంలో శిందే వర్గం నిరూపించుకున్నట్లుగా.. అజిత్‌ పవార్‌ వర్గం తమదే అసలైన ఎన్సీపీ అని తేల్చుకోవాల్సి ఉంటుంది.

ట్విస్టులే ట్విస్టులు

2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు వరుస ట్విస్టులు ఇస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గానూ భాజపా 105 స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు సాధించాయి. భాజపా, శివసేన కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై 145 స్థానాలు సాధించినప్పటికీ.. సీఎం పదవి అంశంపై శివసేన తన పట్టు విడవలేదు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఫలితంగా రాజకీయ సంక్షోభం ఏర్పడి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. కొన్నాళ్లకు భాజపా, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భాజపాకి చెందిన దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ అజిత్‌కు ఎన్సీపీ నుంచి ఎవరు మద్దతు ఇవ్వకపోవడంతో బలపరీక్షకు ముందే వీరిద్దరూ రాజీనామా చేశారు.

ఈ క్రమంలో నవంబరు 29, 2019న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కలిసి ‘మహా వికాస్‌ అఘాడీ కూటమి’ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతి కాలంలో రాజకీయ విభేదాలతో శివసేన రెండు వర్గాలుగా చీలిపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి శిందే వర్గంలోని 30 ఎమ్మెల్యేలు తమదే అసలైన శివసేన అంటూ గవర్నర్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా ఉద్ధవ్‌ ఠాక్రేకు తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి 50 మంది మద్దతు తమకు ఉందని అసెంబ్లీలో పెద్ద పార్టీ భాజపా కూడా తమకు మద్దతు పలుకుతోందని దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతివ్వాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం ఉద్ధవ్‌ బలనిరూపణ చేసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో బలనిరూపణకు ముందే ఉద్ధవ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శివసేనలోని శిందే వర్గానికి భాజపా మద్దతు తెలపడంతో.. శిందే ముఖ్యమంత్రిగా, భాజపాకి చెందిన ఫడణవీస్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఈ ప్రభుత్వం పాలన సాగిస్తోంది.

ఎన్సీపీలో కుదుపు

గతంలో శివసేనలో చోటు చేసుకున్న పరిణామాలే ఇప్పుడు ఎన్సీపీలోనూ కనిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ కీలక బాధ్యతలను ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ తన సోదరుని కుమారుడు అజిత్‌పవార్‌ను కాదని, కుమార్తె సుప్రియా సూలేకు అప్పగించారు. పార్టీకి ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించిన ఆయన.. సుప్రియా సూలేతోపాటు పార్టీ సీనియర్‌ నేత ప్రపుల్‌ పటేల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో అజిత్‌ పవార్‌ చిన్నబుచ్చుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ప్రతిపక్షనేతగా ఉన్న ఆయన.. తన వర్గంతో కలిసి అధికార పక్షానికి మద్దతివ్వడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అంతేకాకుండా ఈ పరిణామం ఎన్సీపీ భవితవ్యంపైనా ప్రశ్నలు సంధిస్తోంది. ఒకవేళ అజిత్‌ పవార్ నిర్ణయాన్ని ఎన్సీపీ అధిష్ఠానం వ్యతిరేకిస్తే.. ఆ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. తమ వర్గమే అసలైన ఎన్సీపీ అని అజిత్‌పవార్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

వరుసగా మూడోసారి అజిత్‌ ప్రమాణస్వీకారం

సాధారణంగా ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు, మంత్రివర్గ విస్తరణ సమయంలో ప్రమాణస్వీకారాలు జరుగుతుంటాయి. ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో ఒకట్రెండు మహా అయితే మూడు సార్లు జరగొచ్చు. కానీ, మహారాష్ట్రలో మాత్రం 2019 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

  • 2019 నవంబరులో తొలిసారి భాజపాకి చెందిన దేవేంద్ర ఫడణవీస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేవలం 80 గంటల వ్యవధిలోనే వీరిద్దరూ రాజీనామా చేశారు.
  • అక్కడికి నెల రోజుల్లోనే ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి మహావికాస్‌ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసిన శివసేన (అవిభక్త శివసేన) నేత ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ బాధ్యతలు చేపట్టారు.
  • గతేడాది జూన్‌లో శివసేన నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబావుటా ఎగురవేయడంతో ఆ పార్టీలో చీలిక ఏర్పడింది. తదనంతర పరిణామాలతో జూన్‌ 30న ఏక్‌నాథ్‌ శిందే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడణవీస్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
  • తాజాగా అధికార పక్షానికి మద్దతు పలికిన అజిత్‌ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తొలి మూడు ప్రమాణస్వీకారాలను అప్పటి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ జరిపించగా.. తాజా కార్యక్రమాన్ని  గవర్నర్‌ రమేశ్‌ బయాస్‌ నిర్వహించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని