Goa Congress: ‘భగవంతుడిని అడిగా.. నీ ఇష్టం అన్నారు’

పార్టీ మారబోమంటూ ఏడు నెలల క్రితం ఆలయం, చర్చి, మసీదులో ‘విధేయత ప్రతిజ్ఞ’ చేసిన ఎమ్మెల్యేలు నేడు భాజపాలో చేరిపోయారు. ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయించబోమంటూ..........

Published : 15 Sep 2022 01:55 IST

పనాజీ: పార్టీ మారబోమంటూ ఏడు నెలల క్రితం  ‘విధేయత ప్రతిజ్ఞ’ చేసిన ఎమ్మెల్యేలు నేడు భాజపాలో చేరిపోయారు. ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయించబోమంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలోనే వారు ఈ ప్రతినబూనారు. కానీ ఏడు నెలలు గడవకముందే తమ ప్రతిజ్ఞను పక్కనబెడుతూ గోవా కాంగ్రెస్‌లోని 11మంది శాసనసభ్యుల్లో 8మంది పార్టీ మారిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్ సమక్షంలో బుధవారం కాషాయ కండువా కప్పుకొన్నారు.

కాగా వీరిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ కూడా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ తతంగమంతా జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ మారడంపై కామత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారేందుకు ‘దేవుడి అంగీకారం’ తీసుకున్నానని వ్యాఖ్యానించారు. తనతో సహా భాజపాలో చేరినవారంతా పార్టీ మార్పుపై ఆ భగవంతుడిని అడిగారని.. అందుకు దేవుడు అంగీకరించారని పేర్కొనడం గమనార్హం. ‘నేను భగవంతుడిని నమ్ముతా. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడబోమని ప్రతిజ్ఞ చేసిన మాట వాస్తవమే. కానీ నేను మళ్లీ ఆలయానికి వెళ్లి ఏం చేయాలని భగవంతుడిని అడిగా. నీకు ఏది మంచిదో అది చేయమని దేవుడు నాకు చెప్పాడు’  అంటూ కామత్‌ విలేకర్ల ముందు పేర్కొన్నారు.

గత ఫిబ్రవరిలో గోవా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులంతా ‘విధేయత ప్రతిజ్ఞ’ (loyalty pledge) పేరుతో రాహుల్‌ గాంధీ సమక్షంలోనే ప్రతిజ్ఞ చేశారు. గెలుపొందిన తర్వాత కాంగ్రెస్‌ను వీడబోమని, మరే ఇతర పార్టీలోనూ చేరబోమని ప్రతినబూనినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే సంకల్ప్‌ అమోంకర్‌ గతంలోనే వెల్లడించారు. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 40 స్థానాలకు గానూ భాజపా 20 సీట్లు దక్కించుకోగా.. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని