Ajit Pawar: ఆ పదవిలో ఎంతకాలం ఉంటానో..! చర్చకు దారితీసిన అజిత్‌ పవార్‌ వ్యాఖ్యలు

మహారాష్ట్ర(Maharashtra) రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు ఆసక్తి రేపుతూనే ఉంటాయి. తాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 

Updated : 25 Sep 2023 16:24 IST

ముంబయి: తాను ఎంతకాలం పదవిలో కొనసాగుతానో కచ్చితంగా తెలీదంటూ తాజాగా మహారాష్ట్ర(Maharashtra) డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌(Ajit Pawar) చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. కొద్ది నెలల క్రితం అజిత్‌ తన బాబాయ్‌, ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌కు షాకిచ్చి.. రాష్ట్రంలోని భాజపా-శివసేన ప్రభుత్వంలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన మాటలు చూస్తుంటే పొత్తు సాగదా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆదివారం కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్‌ షా ముంబయిలో పర్యటించారు. ఆయన సమావేశానికి అజిత్ హాజరుకాలేదు. ఇది చర్చకు దారితీసింది. తాను ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నట్లు అమిత్‌ షా(Amit Shah) కార్యాలయానికి వెల్లడించానని అజిత్‌(Ajit Pawar) సమాధానమిచ్చారు. ఇంతలో ఆయన పుణెలోని బారామతిలో జరిగిన కార్యక్రమలంలో మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్నాను. అయితే రేపు ఆ స్థానంలో ఉంటానో..? లేదో..? నేను చెప్పలేను’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

జీతం తీసుకోని మీరు.. రోజుకు అన్ని లక్షలు ఎలా ఖర్చు చేశారు

అజిత్ పవార్, ఆయన మద్దతుదారులతో కలిసి ఈ ఏడాది జులైలో ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. అది కాస్తా పార్టీలో చీలికకు దారితీసింది. అనంతరం.. పార్టీలో తమకు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉందని, పార్టీ పేరుతోపాటు ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలంటూ అజిత్‌ పవార్‌ వర్గం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘం పవార్‌ వర్గాలను అక్టోబర్ ఆరున విచారించనున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. తాను ఈసీ తుది నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాజాగా అజిత్(Ajit Pawar) పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని