Jharkhand: ఎట్టకేలకు వీడిన అనిశ్చితి.. బలపరీక్షలో నెగ్గిన చంపయీ ప్రభుత్వం

ఝార్ఖండ్‌(Jharkhand)లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకుంది. 

Updated : 05 Feb 2024 15:15 IST

రాంచీ: ఝార్ఖండ్‌(Jharkhand)లో చోటుచేసుకున్న రాజకీయ అనిశ్చితి ఎట్టకేలకు వీడింది. సోమవారం నిర్వహించిన బలపరీక్షలో ముఖ్యమంత్రి చంపయీ సోరెన్(Champai Soren) నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలకు గానూ 47 మంది ఆయనకు మద్దతిచ్చారు. ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం సీఎం చంపయీ సోరెన్, మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్ భాజపాపై విమర్శలు గుప్పించారు.

‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా యత్నించింది. హేమంత్‌ సోరెన్‌పై తప్పుడు కేసు పెట్టారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. నేను ఆయనకు పార్ట్‌-2’ అని చంపయీ(Champai Soren) వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో ప్రసంగించిన మాజీ సీఎం..

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తమ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌(Hemant Soren)ను ఈడీ అధికారులు అసెంబ్లీకి తీసుకువచ్చారు. బలపరీక్షలో ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ‘జనవరి 31 రాత్రి.. దేశంలో మొదటిసారి ఒక ముఖ్యమంత్రి అరెస్టయ్యారు. దాని వెనక రాజ్‌భవన్‌ జోక్యం ఉందని నేను నమ్ముతున్నాను’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాము ఓటమిని అంగీకరించడం లేదన్నారు. తనపై ఉన్న ఆరోపణలను ఈడీ నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ సవాలు విసిరారు. చంపయీ సోరెన్‌కు అధికార సంకీర్ణ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉందని వెల్లడించారు. వాస్తవంగా రాజీనామా సమర్పించిన తర్వాతే హేమంత్ అరెస్టయ్యారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని