BRS: కాళేశ్వరంపై కాంగ్రెస్‌ ఆరోపణలు అవాస్తవమని తేలింది: కడియం శ్రీహరి

శ్వేతపత్రాలు, న్యాయ విచారణల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతోందని భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.

Updated : 29 Dec 2023 18:16 IST

హైదరాబాద్: శ్వేతపత్రాలు, న్యాయ విచారణల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతోందని భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. హైదరాబాద్‌లోని భారాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే న్యాయ విచారణ జరగాలన్నారు.

‘‘కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. కానీ, రూ.93వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు అధికారులు చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వమే అంగీకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాస్తవాలు తెలిపినందుకు ధన్యవాదాలు. ప్రాజెక్టు కింద ఒక్క ఎకరాకు సాగునీరు ఇవ్వలేదని ఆరోపించారు. 98వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చినట్టు అధికారులు చెప్పారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చాకే ప్రాజెక్టు పనులు చేపట్టాం. తుమ్మిడిహట్టి వద్ద చేపడితే రూ.38వేల కోట్లకే పూర్తయ్యేదన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80వేల కోట్లకు పెంచారంటున్నారు.

141 టీఎంసీలు నిల్వ చేసేలా రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. అనేక రిజర్వాయర్ల నిర్మాణాల వల్ల వ్యయం పెరిగిందనే విషయాన్ని గమనించాలి. మూడేళ్లలో ప్రాజెక్టుల ద్వారా 98వేల ఎకరాలకు సాగునీరిచ్చాం. దాదాపు 16 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాం. మేడిగడ్డ ఆనకట్ట పియర్స్‌ కుంగడం దురదృష్టకరం. విచారణ తర్వాత దోషులను శిక్షించాలని కోరుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేలింది’’ అని కడియం శ్రీహరి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని